logo

సంక్షిప్త వార్తలు

రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణం ఏనుగొండ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ టి.కృష్ణ కథనం ప్రకారం.. ఏనుగొండకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆంజనేయులు(65).. ఇంటికి సమీపంలో

Updated : 25 Jan 2022 02:25 IST

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణం ఏనుగొండ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ టి.కృష్ణ కథనం ప్రకారం.. ఏనుగొండకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆంజనేయులు(65).. ఇంటికి సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా తిరుపతి నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌(దిల్లీ)కు వెళ్తున్న ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. వృద్ధుడికి చెవులు వినిపించని కారణంగా రైలు రాకను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.


రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

ధన్వాడ : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడిన సంఘటన పేట జిల్లా  ధన్వాడ మండలంలో చోటుచేసుకొంది. ఎస్సై పి.రమేష్‌ కథనం మేరకు.. నారాయణపేట పట్టణానికి చెందిన మహ్మద్‌ ఖాజా సండ్‌కే (23) మహబూబ్‌నగర్‌లో సెల్‌ఫోన్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం మిత్రుడు మహ్మద్‌ ఆసీఫ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ధన్వాడ శివారులో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహన మెకానిక్‌ సందీప్‌ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి మహ్మద్‌ ఖాజా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. రక్షణ కోసం ధరించిన శిరస్త్రాణం సైతం ప్రాణాలను కాపాడలేకపోయింది. మిత్రుడు ఆసీˆఫ్‌ స్వల్ప గాయాలతో బటయపడ్డాడు. సందీప్‌కు సైతం బలమైన గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రమేష్‌ ప్రమాద స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి, మహ్మద్‌ ఖాజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పేట ఆసుపత్రికి తరలించారు.


లారీపై నుంచి టైరు మీదపడి..

నిఖిల్‌రెడ్డి

పరిగి గ్రామీణం, కోయిలకొండ : లారీపై ఉన్న స్టెప్నీటైరు ద్విచక్ర వాహనంపై పడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన పరిగి మండల పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కోయిల్‌కొండ మండలం బూరుగుపల్లికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతుల కుమారుడు నిఖిల్‌రెడ్డి(21) పరిగి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా బోరుబావులను తవ్వే పరికరాలు, పైపులను తరలించే లారీ అతివేగంగా వస్తోంది. కల్వర్టు దగ్గర లారీలో ఉన్న టైరు పైకి లేచి నిఖిల్‌రెడ్డిపై పడటంతో తల పగిలి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనం దూరంగా ఎగిరిపడింది. టైరు వేగంగా పక్కనున్న వంతెనకు ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లిందని, ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు మరో వాహనదారుడు వివరించాడు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణాలు బలితీసుకున్న లారీ డ్రైవర్‌ లారీతోపాటు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని