logo

ఓటు.. భవితకు చోటు

ఓటు.. ఈ మాట వింటే సామాన్యుడు తన చేతిలోని ఆయుధం అని భావిస్తాడు. ప్రతి ఒక్కరి ఓటు ఎంతో కీలకమైంది. ఇంతటి గొప్ప హక్కును కలిగి ఉండటం భారత పౌరులందరి బాధ్యత. వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడం

Updated : 25 Jan 2022 02:24 IST

నేడు జాతీయ ఓటరు దినోత్సవం
న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌

ఓటు.. ఈ మాట వింటే సామాన్యుడు తన చేతిలోని ఆయుధం అని భావిస్తాడు. ప్రతి ఒక్కరి ఓటు ఎంతో కీలకమైంది. ఇంతటి గొప్ప హక్కును కలిగి ఉండటం భారత పౌరులందరి బాధ్యత. వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడం కోసమే భారత ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం..
జోగులాంబ గద్వాల జిల్లాలో గత జాబితా ప్రకారం.. మొత్తం 4,55,811 మంది ఓటర్లున్నారు. ఈ నెల 5న ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. జిల్లాలో 4,58,728 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గద్వాల నియోజకవర్గంలో 2,37,093 మంది, అలంపూర్‌ నియోజకవర్గలో 2,21,635 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే.. 2,917 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. పురుషులు 2,28,195 మంది ఉంటే, మహిళలు 2,30,523 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.
ఫారం - 6
18 సంవత్సరాలు నిండిన వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో పేరు, తండ్రిపేరు, గ్రామం తదితర వివరాలతో ఫారాన్ని పూర్తి చేయాలి. దీనికి గ్రామ నివాసిగా ధ్రువీకరణ పత్రం, ఏదైనా వయస్సు నిర్ధారిత పత్రం, ఫోటో, స్థానికంగా ఉండే ఎవరిదైనా ఓటరు గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది.
ఫారం - 7
ఓటరు నమోదుకు ఫారం-6 ఎంత అవసరమో.. ఓటరును తొలగించేందుకు ఫారం-7 అవసరం ఉటుంది. ఈ ఫారం ద్వారా ఎవరైనా తమ ఓటును తొలగించుకోవచ్చు. చనిపోయిన వారివి, వివాహం చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారివి, వేరే గ్రామాల్లో స్థిరపడిన వారి ఓట్లు తొలగించుకోవాలంటే.. ఫారం-7 పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. స్థానిక బీఎల్వో విచారణ చేసి ఓటు తొలగిస్తారు.
ఫారం - 8
ఫారాం-8 అనేది ఓటరు ఏవైనా సవరణలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. పేరు మార్పు, చిరునామా, వయస్సు, ఫోటో ఇలా అన్ని రకాల మార్పులకు ఈ ఫారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ లేదా నేరుగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయవచ్చు. దరఖాస్తు ఫారంలో ఏదైతే మార్పు చేయాలనుకుంటున్నామో దానికి సంబందించిన ధ్రువీకరణపత్రాలను జత చేయాలి.
ఫారం - 8ఏ :
మండలం, గ్రామం ఇలా ఏది మారినా.. అక్కడ ఓటు హక్కు పొందాలనుకుంటే ఫారం-8ఏ తో దరఖాస్తు చేసుకోవచ్చు. శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉద్యోగ, వ్యాపారరీత్యా, ఇతర ఏవైనా కారణాలతో వేరే గ్రామాల్లో స్థిరపడిన వారు నివాసముండే గ్రామంలో ఓటు హక్కు పొందాలంటే ఈ ఫారంతో దరఖాస్తు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని