logo

త్రాసు.. తిరకాసు

సమతూకం లేని త్రాసులతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఓవైపు ధరల మోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోవైపు పలువురు వ్యాపారులు తూకాలలో మోసాలకు పాల్పడుతూ అడ్డగోలుగా

Published : 25 Jan 2022 03:15 IST

 జిల్లాలో 80 శాతమే ఎలక్ట్రానిక్‌ కాంటాల వినియోగం
 మూడు జిల్లాలకు ఒక్కరే ఇన్‌ఛార్జి
    న్యూస్‌టుడే, వనపర్తి పట్టణం 

సమతూకం లేని త్రాసులతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఓవైపు ధరల మోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోవైపు పలువురు వ్యాపారులు తూకాలలో మోసాలకు పాల్పడుతూ అడ్డగోలుగా దోచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వ్యాపార సంస్థలు ఉండగా వాటిలో 80 శాతం దుకాణాలలోనే ఎలక్ట్రానిక్‌ కాంటాలు వినియోగిస్తున్నారు. ఇక చిరు వ్యాపారులు సాధారణ త్రాసులనే ఉపయోగిస్తుండగా కొందరు పాతకాలం నాటి తక్కెడ, రాళ్లతోనే తూకాలు వేస్తున్నారు. సరకులను తూకంవేసే రాళ్లను ఉద్దేశపూర్వకంగా కోయడం, అవి సరిగా కనిపించకుండా చేసి మోసం చేయడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలుచోట్ల చేపలు, కూరగాయలు విక్రయించే వీధి వ్యాపారులు తక్కెడలను ఉపయోగిస్తూ తూకాలలో దండె కొడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

తూకం రాళ్లపై రెన్యువల్‌ ముద్ర వేస్తున్న కార్యాలయం ఉద్యోగి

సిబ్బంది లేక అవస్థలు.. : వినియోగదారులకు ఎలాంటి నష్టం వాటిల్లినా.. వ్యాపారుల చేతిలో మోసాలకు గురైనా న్యాయం చేయాల్సిన తూనికలు కొలతల శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న కొద్దిమందిపైనే పని భారం పెరిగి వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వనపర్తి జిల్లా అధికారి సత్యనారాయణకు గద్వాల, నారాయణపేట జిల్లాల ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఈ మూడు జిల్లాలలో పర్యటించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వనపర్తి, గద్వాల జిల్లా కార్యాలయాలలో కేవలం ఇద్దరు సిబ్బందే పనిచేస్తుండగా నారాయణపేటలో ఒక్క ఉద్యోగి కూడా లేరు. దీంతో మూడు జిల్లాల బాధ్యతలను మోస్తున్న అధికారి రోజూ ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ అడపాదడపా తనిఖీలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు, సంస్థల కేసులు నమోదు చేస్తున్నారు.
నిబంధనలు పాటించని వైనం..
చాలామంది వ్యాపారులు నిబంధనలు పాటించకుండా తూకాలు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ కాంటాలు ఉపయోగించేవారు కచ్చితంగా ప్రతి సంవత్సరం తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికి వచ్చి తనిఖీ చేయించుకొని వాటిపై రెన్యువల్‌ ముద్ర వేయించుకోవాలి. తూకం రాళ్లు, బాట్లను ఉపయోగించేవారు ప్రతి రెండేళ్లకు ఒకసారి కాంటాలు, బాట్లను రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉండగా ఈ నిబంధనలను చాలామంది పాటించడం లేదని తెలుస్తోంది. అలాగే ప్రతి వస్తువుపై ప్రభుత్వం నిర్ణయించి ముద్రించిన ఎమ్మార్పీ ధరలను సైతం వ్యాపారులు అమలుచేయకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది వినియోగదారులు తాము మోసానికి గురవుతున్నామని తెలిసినా అధికారులకు ఫిర్యాదుచేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేస్తేనే తప్ప తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేయడం లేదు.
తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నాం..
నేను బాధ్యతలు నిర్వహిస్తున్న మూడు జిల్లాల్లో ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే వెంటనే తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాం. రెండు రోజుల క్రితం కొత్తకోటలో గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనలపై నాలుగు కేసులు నమోదు చేశాం. గత ఏడాది ఓ పెట్రోలుపంపుపై కేసు నమోదుచేసి రూ.20 వేల జరిమానా వసూలు చేశాం. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు పాత కాలం నాటి తక్కెడలు ఉపయోగిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. త్వరలో ప్రత్యేక డ్రైవ్‌లో తనిఖీలు చేపడతాం. ఆధునిక, ఎలక్ట్రానిక్‌ కాంటాలు ఉపయోగించాలని వారికి సూచిస్తాం. 

- సత్యనారాయణ, తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని