logo

గబగబా తింటే గండమే

గొంతులో మాంసం ముక్కలు, బజ్జీలు, గుడ్లు, ఇతర ఇతర ఆహార పదార్థాలు ఇరుక్కొని మృత్యువాత పడుతున్నారు. తిన్న ఆహారం అన్నవాహికలో నుంచి కడుపులోకి ప్రవేశిస్తే...

Updated : 29 Jan 2022 14:18 IST

గొంతులో ఆహారం ఇరుక్కుని పోతున్న ప్రాణాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు
న్యూస్‌టుడే, పాలమూరు

కోడేరు మండలం ఎత్తం గ్రామంలో నారాయణ(63) అనే వ్యక్తి ఈనెల 19న ఓ కార్యక్రమంలో భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. శ్వాస ఆడలేదు. సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోగానే అతను మరణించాడు. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ మహిళ మృతిచెందింది. మిడ్జిల్‌ మండలం చేదుగట్టుతండాలో ముత్యాలమ్మ పండుగ నిర్వహించారు. చంద్రు(60) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా గొంతులో మటన్‌ ముక్క ఇర్కుని చనిపోయాడు. ఇదే మండలం వేములలో మల్లేశ్‌(32)  గొంతులో బజ్జీ ఇరుక్కుని చనిపోయాడు. ..ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులను సంప్రదించి ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనమిది.

గొంతులో మాంసం ముక్కలు, బజ్జీలు, గుడ్లు, ఇతర ఇతర ఆహార పదార్థాలు ఇరుక్కొని మృత్యువాత పడుతున్నారు. తిన్న ఆహారం అన్నవాహికలో నుంచి కడుపులోకి ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్న వాహికలోకి కాకుండా శ్వాస నాళంలోకి వెళ్తే ఇబ్బందులు వస్తాయి. కానీ చాలామంది తిన్న ఆహారాన్ని సక్రమంగా నమలకుండా ఒకేసారి మింగేస్తుంటారు. ఈ క్రమంలో శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కొని ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్నాయి. కుటుంబ సభ్యులు వెంటనే వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే గొంతులో ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు తొలగిస్తారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లకపోయినా శ్వాసనాళంలో ఆహారం కొంత ఉంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. కచ్చితంగా తొలగించుకోవాలి. 

తాగి ఉంటే ప్రమాదమే..

మద్యం తాగేటప్పుడు చాలా మంది మాంసం, బజ్జీలు వంటివి తింటుంటారు. మద్యం ఎక్కువైనప్పుడు గొంతులో కండరాలపై నియంత్రణ కోల్పోతారు. నోట్లో వేసుకున్న ముక్కను సక్రమంగా నమలలేరు. వాటిని అలాగే మింగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిషాలో ఉండటంతో వారికి తెలియకుండానే అవి గొంతులోకి వెళతాయి. వెళ్లిన ముక్కలు శ్వాస నాళంలోకి చేరటంతో ఇబ్బందులు వస్తాయి. అందుకే మద్యం తాగుతూ మాంసం, ఇతర ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. తింటూ మాట్లాడటం కూడా ప్రమాదకరం. 

వీపుపై గట్టిగా కొట్టాలి..

ఆహారం తినేటప్పుడు గొంతులో ఎలాంటి ముక్క ఇరుక్కున్నా.. వెంటనే వీపుపై గట్టిగా కొట్టాలి. అతడికి దగ్గు వచ్చేలా చూడాలి. దగ్గినప్పుడు గొంతులో ఉన్న ముక్క బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధితుడు కూడా బలంగా దగ్గుతూ గొంతులో ఇరుక్కొని పోయిన ముక్క బయటకు వచ్చేలా చేయాలి. 


నమలకుండా తినకూడదు..

- డా.శ్రీకాంత్‌, ఈఎన్‌టీ వైద్య నిపుణులు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, మహబూబ్‌నగర్‌

తినేటప్పుడు మాంసం, ఇతర పదార్థాలు బాగా నమిలి మింగాలి. అప్పుడే సరిగ్గా జీర్ణమవుతుంది. గబగబా తింటే గొంతులో ఇరుక్కొంటాయి. శ్వాస నాళంలోకి అడ్డుగా వెళ్తే ప్రాణాలు కూడా పోతాయి. మద్యం సేవించే వారికే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎంత ప్రయత్నించినా గొంతులోని ఆహారం వెళ్లకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని