logo

మళ్లీ కల్తీ కల్లు జోరు

ఉమ్మడి జిల్లాలో కల్తీకల్లు దందా మళ్లీ జోరందుకుంది. వివిధ ప్రమాదకర పదార్థాలు కలిపి తయారుచేస్తున్న కల్లుకు అలవాటుపడిన వాళ్లు అది లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. అనేక వ్యాధుల బారినపడుతున్నారు. పలుచోట్ల కల్లు

Updated : 09 Jun 2023 17:24 IST

నమూనాల సేకరణకే ఆబ్కారీ శాఖ  పరిమితం
న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం

జడ్చర్ల పట్టణం సమీప డిపోలో కల్తీకల్లు తయారీకి పదార్థాలు సిద్ధం చేస్తున్న మహిళ

మ్మడి జిల్లాలో కల్తీకల్లు దందా మళ్లీ జోరందుకుంది. వివిధ ప్రమాదకర పదార్థాలు కలిపి తయారుచేస్తున్న కల్లుకు అలవాటుపడిన వాళ్లు అది లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. అనేక వ్యాధుల బారినపడుతున్నారు. పలుచోట్ల కల్లు దుకాణాల్లోనే చనిపోతున్నా ఎంతో కొంత ముట్టజెప్పి బాధిత కుటుంబాలు కేసులు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్లుగీత కార్మికుల సహకార సంఘాల కల్లు డిపోలకు 312, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు 772 ఉన్నాయి. తాటి, ఈత చెట్ల సంఖ్య తక్కువగా ఉన్నాయి. అయినా నిత్యం వేలాది లీటర్లు అమ్ముతుండటం కృత్రిమ కల్లేనన్న విషయం తెలియజేస్తోంది. అయినా ఎక్కడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. తాటి, ఈత చెట్ల సంఖ్య, కల్లు గీయటం చాలా తక్కువే అయినా వేలాది లీటర్లు నిత్యం విక్రయిస్తుండటం గమనార్హం.  

ఫార్మా ముడిసరకు వినియోగం..
గతంలో క్లోరల్‌ హైడ్రేత్‌ అనే మత్తు పదార్థంతో కల్లు తయారు చేసేవారు. కల్లు తాగిన వ్యక్తులు మరణించినప్పుడు అధికారులు నమూనాలు సేకరించి కల్తీని అక్కడికక్కడే తేల్చే పరిస్థితి ఉండేది. దీంతో 7 ఆ పదార్థం వాడటం మానేసి ఆల్ఫాజోలం, డైజోఫాంపై దృష్టిపెట్టారు. ఆల్ఫాజోలం ఫార్మా పరిశ్రమల్లో వినియోగిస్తారు. గుళికల రూపంలో లభిస్తుంది. ఎక్కువగా మత్తు వచ్చి నిద్రపడుతుంది. రోజంతా పనిచేసే కార్మికులు, కూలీలు రాత్రి నిద్ర పట్టడం కోసం ఈ కల్లు తాగుతూ బానిసలుగా మారుతున్నారు. ఈ పదార్థంతో తయారుచేసిన కల్లు నమూనాలు తీసి అప్పటికప్పుడు పరీక్షలు చేస్తే ఫలితం తేలదు. రాష్ట్రంలో ఉన్న రెండే ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. కానీ ముందస్తుగానే కల్లు విక్రయదారులకు సమాచారం ఇచ్చి కల్తీ లేని కల్లు నమూనాలు సేకరిస్తూ అధికారులు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫార్మా కంపెనీలకు ముడిసరకు అందించే హైదరాబాద్‌ సమీప పరిశ్రమల నుంచి వీటిని గుట్టుగా సరఫరా చేస్తున్నారు. మిల్లీ గ్రాముల్లో ఉండే ఈ పదార్థం ధర రూ. వేలల్లో ఉంటుంది. సులువుగా రూ.లక్షలు సంపాదించవచ్చని ఈ పని చేస్తున్నారు. జడ్చర్లకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త అనుచరుడు మత్తు రసాయన పదార్థాలు సరఫరా చేస్తున్నారు.

బాదేపల్లి డిపోలో సీసాల్లో నింపేందుకు సిద్ధం చేసిన కల్లు


అధికారుల మొక్కుబడి చర్యలు..

డ్చర్లలోని బాదేపల్లి కల్లుగీత సహకార సంఘం విక్రయిస్తున్న కల్లు కల్తీ జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ దాడుల్లో పట్టుబడటంతో 2016లో లైసెన్స్‌ రద్దు చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. కానీ 2018లో న్యాయస్థానం మూడు నెలలు స్టే ఇచ్చింది. అమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. ఆబ్కారీసీఐ బాలాజీని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు యధాతథ స్థితిని కొనసాగించాలని అప్పటి ఆబ్కారీశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారని, ఆ ప్రకారం నిర్వహిస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లోనూ ఇలాగే జరిగింది. జడ్చర్ల పురపాలికలోని ఆలూరు రహదారిలో సంఘం నిర్వహించే కల్లుడిపోలో కల్లు విక్రయిస్తున్నారు. జడ్చర్ల కల్లుగీత సహకార సంఘం వారు నిబంధనలకు విరుద్ధంగా శ్రీనివాస థియేటర్‌ సమీపంలోని ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌లోనే కల్లు తయారు చేసి అమ్ముతున్నారు. 2020 డిసెంబరు 13న జడ్చర్ల మండలం ఆలూరులోని కల్లు దుకాణంలో వెంకటేశ్‌, కాశీం అనే యువకులు కల్తీకల్లు తాగి మృతిచెందారు. అధికారులు నమూనాలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపగా కల్తీకల్లుగా నిర్ధారణ అయ్యింది. గీత కార్మికులపై కేసు పెట్టి జైలుకు పంపారు.


ఉమ్మడి జిల్లాలో ఇక్కడిక్కడ..
మహబూబ్‌నగర్‌లోని బోయపల్లి గేటు, జడ్చర్లలో ఆలూరు రోడ్డు, నవాబుపేట, భూత్పూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, బిజినేపల్లి, గోపాల్‌పేట, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, ధరూర్‌, పేట జిల్లాలోని మద్దూర్‌, ఉట్కూర్‌, తిప్రాన్‌పల్లి, కర్ణాటక సరిహద్దులోని జలాల్‌పూర్‌, దామరగిద్ద, వనపర్తి జిల్లాలో కల్తీకల్లు దందా జోరుగా సాగుతోంది. యువకులతో ద్విచక్రవాహనాలపై వివిధ ప్రాంతాలకు కల్లు ప్యాకెట్లు సరఫరా చేయిస్తున్నారు. అచ్చంపేట ప్రాంతంలో వరుసగా మరణాలు జరిగినా కేసుల దాకా వెళ్లకుండా రాజీ కుదుర్చుకున్నారు. ఆబ్కారీశాఖ మహబూబ్‌నగర్‌ జిల్లా సూపరింటెండెంట్‌, గద్వాల, పేట జిల్లాల ఇన్‌ఛార్జి సైదులుని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా గతవారమే నమూనాలు సేకరించామని, కల్తీ జరిగితే ఫలితాల్లో తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.

A2

B2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని