logo

Telangana News: తల్లి కిడ్నీ దానం చేసినా.. నిలవని తనయుడి ప్రాణం

కుమారుడికి కిడ్నీలు రెండూ చెడిపోయాయి. డయాలసిస్‌తో ప్రాణాలు నిలవవని.. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో ఆ మాతృమూర్తి చలించిపోయింది.

Updated : 25 May 2022 11:54 IST


రాజశేఖర్‌..                          విషణ్ణవదనంతో ఎమేలమ్మ

అమరచింత, న్యూస్‌టుడే : కుమారుడికి కిడ్నీలు రెండూ చెడిపోయాయి. డయాలసిస్‌తో ప్రాణాలు నిలవవని.. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో ఆ మాతృమూర్తి చలించిపోయింది. కొడుక్కి పునర్జన్మ ఇచ్చేందుకు సిద్ధమైంది. తన మూత్రపిండాన్ని దానం చేయడంతో పక్షం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతమైందని ప్రకటించడంతో సంతృప్తిచెందిన ఆ తల్లి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం ఆస్పత్రిలోనే కొడుకు కన్నుమూయడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన అమరచింత పట్టణంలోని పాత దళితకాలనీలో విషాదం నింపింది. కావలి చిన్నకుర్మన్న, ఎమేలమ్మ దంపతులు బీడీ కార్మికులుగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు రాజశేఖర్‌ (27)కు ఆరు నెలల కిందట మూత్రపిండాల్లో సమస్య ఏర్పడింది. అప్పులు చేసి వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. ఉస్మానియా ఆస్పత్రిలో చూపించగా ఎవరైనా కిడ్నీ దానం చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెప్పారు. కళ్లెదుటే కన్నకొడుకు పడుతున్న బాధను చూడలేక ఎమేలమ్మ కిడ్నీ దానం చేయడానికి అంగీకరించింది. పక్షం రోజుల కిందట వైద్యులు తల్లి నుంచి మూత్రపిండాన్ని తీసి కొడుక్కి అమర్చారు. చికిత్స విజయవంతమైందని వివరించారు. రెండు వారాలు గడిచిన తర్వాత పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం రాజశేఖర్‌ మృతిచెందాడు. తల్లి అవయవ దానం చేసినా కుమారుడి ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులతో పాటు పలువురు కన్నీరు పెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని