logo

ఔషధ వ్యాపారం పైపైకి..

ఔషధ దుకాణాలు వేగంగా పెరుగుతున్నాయి..ప్రధానంగా కరోనా తరవాత వీటి సంఖ్య ఎక్కువవుతోంది.. కరోనా మొదటి దశ తరవాత రెండేళ్లలో 407 దుకాణాలు పెరిగాయంటేనే విస్తరిస్తున్న ఈ వ్యాపారాన్ని అంచనా వేయొచ్చు. ఔషధ నియంత్రణ శాఖ ఉమ్మడి జిల్లా అధికారుల

Published : 28 Jun 2022 05:39 IST

కరోనా తరవాత పెరుగుతున్న దుకాణాలు
రోజుకు వ్యాపారం రూ.1.10 కోట్ల్ఞు
న్యూస్‌టుడే, పాలమూరు

ఔషధ దుకాణాలు వేగంగా పెరుగుతున్నాయి..ప్రధానంగా కరోనా తరవాత వీటి సంఖ్య ఎక్కువవుతోంది.. కరోనా మొదటి దశ తరవాత రెండేళ్లలో 407 దుకాణాలు పెరిగాయంటేనే విస్తరిస్తున్న ఈ వ్యాపారాన్ని అంచనా వేయొచ్చు.
ఔషధ నియంత్రణ శాఖ ఉమ్మడి జిల్లా అధికారుల నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 2020 ఏప్రిల్‌ కంటే ముందు 1,161 దుకాణాలు ఉండేవి. కరోనా తరవాత ఔషధాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. వ్యాధులు వచ్చిన తరవాత వాడేవే కాకుండా, ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధకత పెంచుకోవడానికి విటమిన్‌ టాబ్లెట్ల వినియోగం పెరగడంతో వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. కరోనా సోకితే మందులు దొరుకుతాయో లేదోనని చాలా మంది ముందే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో రోజుకు రూ.2.20 కోట్ల వ్యాపారం సాగిన రోజులున్నాయి. ఆ డిమాండ్‌ ఔషధ దుకాణాల ఏర్పాటుపై ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానికులు నిర్వహిస్తున్నవి 1,568 దుకాణాలు ఉండగా, మరో 200 దుకాణాల వరకు కార్పొరేట్‌ సంస్థలకు చెందినవి ఉన్నాయి. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కరోనా కంటే ముందు ఓ కార్పొరేట్‌ సంస్థకు చెందిన ఔషధ దుకాణాలు 6 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 20కి పెరిగింది. వచ్చే రెండు, మూడు నెలల్లో మరో 10 దుకాణాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ఔషధ దుకాణాల ద్వారా రోజుకు సగటున రూ.1.10 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆ వ్యాపార వర్గాలు తెలిపాయి. 2020 ఏప్రిల్‌కు ముందు రోజుకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకే వ్యాపారం ఉండేదని పేర్కొన్నాయి.

దుకాణాలు పెరగడానికి కారణాలు
* కరోనా తరవాత ఔషధ వ్యాపారం లాభసాటిగా ఉందన్న అభిప్రాయం పెరగడం.
* ఉమ్మడి జిల్లాలో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు నేరుగా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. అనుబంధంగా ఔషధ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
* ఫార్మసీ విద్య పూర్తి చేసినవారు65 శాతం సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా, మిగతా 35 శాతం తమ ధ్రువపత్రాలను ఇతరులకు ఇచ్చి అద్దె తీసుకుంటున్నారు.
*  కార్పొరేట్‌ సంస్థలకు చెందిన పలు ఔషధ దుకాణాలు ఎక్కువవుతున్నాయి. ఇవి ఔషధాల కొనుగోళ్లపై రాయితీలు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.


ఉమ్మడి జిల్లాలో 5 వేల కుటుంబాలకు ఆధారం
ఉమ్మడి జిల్లాలో 5 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఔషధ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నాయని ఔషధ దుకాణాల సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పుల్లా శ్రీనివాస్‌ చెప్పారు. ఇటీవల ఆన్‌లైన్‌లో ఔషధాలు తెప్పించుకోవడం పెరిగిందన్నారు. మందుల చీటీ లేకుండా తాము కొన్ని ఔషధాలు విక్రయించలేమని, అంతర్జాలం ద్వారా విక్రయాలకు మాత్రం ఎలాంటి పర్యవేక్షణ లేదని చెప్పారు. ఔషధ నియంత్రణశాఖ ఉమ్మడి జిల్లా ఏడీ దినేష్‌కుమార్‌ అన్ని అర్హతలు ఉన్న దుకాణాలకే అనుమతిస్తున్నామని చెప్పారు. దుకాణాలలో తప్పనిసరిగా ఫార్మసిస్టు ఉండాలనే నిబంధనలను అందరూ పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని వారికి శ్రీముఖాలను జారీ చేస్తున్నామని, కొన్ని దుకాణాల అనుమతులను రద్దు చేస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని