logo

మూగజీవాల సేవకుల మౌనరోదన

వ్యవసాయంలో రైతుకు చేదోడువాదోడుగా ఉంటే పశువులకు ఏదైనా జబ్బు చేసిందంటే అన్నదాత విలవిల్లాడుతాడు. తాను ఉంటున్న గ్రామం నుంచి మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు మూగజీవిని తీసుకువెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఫోను

Updated : 03 Jul 2022 07:17 IST

వేతనాలు అందక ఇబ్బందిపడుతున్న 1962 సంచార పశు వైద్యశాల సిబ్బంది

న్యూస్‌టుడే, వనపర్తి

సంచార పశువైద్యశాల వాహనం

వ్యవసాయంలో రైతుకు చేదోడువాదోడుగా ఉంటే పశువులకు ఏదైనా జబ్బు చేసిందంటే అన్నదాత విలవిల్లాడుతాడు. తాను ఉంటున్న గ్రామం నుంచి మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు మూగజీవిని తీసుకువెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఫోను ద్వారా స్పందించి సంచార వైద్యశాల పేరిట రైతు ముంగిటకే వెళ్లి పశువైద్య సిబ్బంది మూగజీవాలకు వైద్యం అందిస్తున్నారు. నోరులేని జీవాలు ఏ ప్రాంతంలో, ఏ ఆపదలో ఉన్నా 1962 నంబరుకు ఫోన్‌చేస్తే చాలు సిబ్బంది అక్కడికి చేరుకుని సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా జీవీకే ఈఎంఆర్‌ఐ (1962) పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో పడ్డారు. వీరికి ఏనాడూ నెల నెలా జీతాలు చెల్లించడం లేదు.  రెగ్యులరుగా వచ్చే జీతాల కోసం మూడు, నాలుగు నెలల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. కరోనా కష్టకాలంలో అయితే 10 నెలల వరకూ జీతాలు అందని సందర్భాలు ఉన్నాయి. తాజాగా మూడు నెలల వేతనాలు రావాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. అవి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇచ్చేదే అరకొర.. అవీ సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

సెగ్మెంటుకు ఓ వాహనం

అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో పశు వైద్య సేవలందించేందుకు 1962 పేరిట ప్రత్యేకంగా ఓ వాహనాన్ని ఏర్పాటుచేశారు. దాన్నే పశు సంచార వైద్యశాలగా పిలుస్తున్నారు. ఒక్కో వాహనంలో పశు వైద్యుడు/వైద్యురాలు, పారా వెట్, సహాయకుడు, డ్రైవర్‌ మొత్తం నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ ప్రాంతం నుంచైనా 1962 నంబరుకు రైతులు ఫోనుచేసి సమాచారమిస్తే వైద్య సిబ్బంది వాహనంలో అక్కడికి వెళ్లి మూగజీవాలకు సేవలందిస్తారు. ఉదయం ఏడు గంటల కన్నా ముందే ఆ ప్రాంతానికి చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసర సేవలందిస్తారు.

ఆటంకం లేకుండా సేవలు..

ఒకవైపు జీతాలు సక్రమంగా అందక సంచార వైద్యశాల సిబ్బంది నానా యాతన పడుతున్నా, రైతులకు అందించే సేవల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. ఒకేసారి రెండు ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోకుండా రైతులకు కాస్త సమయం ఇవ్వాలని నచ్చజెప్పి వారి ముంగిటకే వెళ్లి సేవలందిస్తున్నారు. నియోజకవర్గానికో సంచార వైద్యశాల ఉన్నా వనపర్తి జిల్లాలో పూర్తిస్థాయిలో ఒకే నియోజకవర్గం ఉంది. దీంతో సమీపంలోని కొల్లాపూరు నియోజకవర్గం పరిధిలోని పాన్‌గల్‌, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోటలో ఇక్కడి సిబ్బందే చేరుకుని సేవలందిస్తున్నారు. మందుల కొరత కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో చీటీలు రాస్తున్నామని, వాటిని మార్కెట్‌లో కొనుగోలుచేసి రైతులు జీవాలకు వేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.


జీతాలు రెగ్యులరుగా ఇస్తే బాగు..

సంచార పశు వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి రెగ్యులరుగా జీతాలు రావడం లేదు. కరోనా కాలంలో జీతాలు రాక మా సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయిదారు నెలల పాటు పనిచేస్తే ఒక నెల జీతమే వస్తోంది. నాలుగు నెలల పెండింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. జీతాలు సక్రమంగా చెల్లిస్తే సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.

- సాయిప్రకాశ్‌, సంచార పశు వైద్యాధికారి, వనపర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని