logo
Published : 06 Aug 2022 05:31 IST

అంగన్వాడీలకు కుళ్లిన గుడ్లు

చిన్న సైజులో పంపిణీ
న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌ 


పెద్దతాండ్రపాడులోని ఓ అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు ఇలా..

చిన్నారులు, గర్భిణులకు పోషకాహారలోపం లేకుండా చూసేందుకు అంగన్వాడీ కేంద్రాలకు అందజేస్తున్న గుడ్ల పంపిణీ ఇష్టారీతిగా సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపంతో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లినవి, పగిలినవి, చిన్న సైజు గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఫలితంగా లబ్ధిదారులు పోషకాహారానికి దూరం అవుతున్నారు.

జిల్లాలో మూడు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 713 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 20,731 మంది చిన్నారులు, 5624 మంది గర్భిణులు, 5621 మంది బాలింతలు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్లు, బాలామృతం, పాలు, మురుకులతోపాటు, అన్నం, పప్పుతో కూడిన పోషకాహారం అందజేస్తున్నారు. మిగతా ఆహారం ఎలా ఉన్నా.. ప్రతి ఒక్కరూ గుడ్డు తప్పనిసరిగా తీసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలకు నెలకు 30 గుడ్లు(ఉడకబెట్టనివి), 7 నెలల నుంచి 3 సంవత్సరాల వారికి 16 గుడ్లు, కేంద్రాలకు వచ్చే వారికి రోజూ ఒక గుడ్డు అందించాల్సి ఉండగా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. కొందరు అధికారుల అండదండలతో ఇష్టారీతిగా గుడ్లు సరఫరా అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి  
టెండర్లు వేసిన గుత్తేదారు ప్రతి 15 రోజులకోసారి జిల్లావ్యాప్తంగా కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన గుడ్లు నాణ్యతగా ఉండటం లేదు. మార్కెట్లో లభించే గుడ్ల కంటే చిన్నగా వస్తుండటంలో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. తీసుకొచ్చే క్రమంలో మరికొన్ని గుడ్లు పగిలిపోతున్నాయి. ఫలితంగా 30 ఇవ్వాల్సి ఉండగా 25 లోపే గుడ్లు ఇస్తున్నారు. చిన్నారులకు రోజూ గుడ్డు ఇవ్వడం లేదు. ఇక గుడ్లను ఇంటికి తీసుకొచ్చిన లబ్ధిదారులు ఉడికించుకునే క్రమంలో తీవ్రమైన కుళ్లిపోయిన దుర్వాసన వస్తున్నాయి. ఉడికిన గుడ్లపై నల్లటి మచ్చలు వస్తున్నాయి. దీంతో వాటిని తినేందుకు చిన్నరులు, గర్భిణులు ఆసక్తి చూపడం లేదు. రాజోలి, వడ్డేపల్లి, ఉండవల్లి తదితర మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. మానవపాడులో కుళ్లిన గుడ్లు రావడంతో గుత్తేదారుకే వెనక్కి పంపించిన సంఘటనలున్నాయి.

వెనక్కి పంపాలని సూచించాం
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్ల విషయంలో ఎలాంటి రాజీ లేదు. తప్పకుండా నాణ్యమైన గుడ్లు అందించాల్సిందే. దీనిపై గుత్తేదారులకు కూడా సూచించాం. పాడైనవి, పగిలినవి, చిన్న సైజు ఉన్నవి ఇలా ఏ సమస్య ఉన్నా తీసుకోకుండా వెనక్కి పంపించాలని కార్యకర్తలకు సూచించాం. కొందరు వెనక్కి పంపించారు. దీనిపై ఆరా తీసి సమస్య లేకుండా చూస్తాం.

- ముషాహిదాబేగం, డీడబ్ల్యూవో, గద్వాల

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని