logo
Published : 06 Aug 2022 05:31 IST

వెంటాడుతున్న నిధుల కొరత

కేఎల్‌ఐలో 3వ మోటారుకు మరమ్మతులు కరవు
న్యూస్‌టుడే, కొల్లాపూరు


ఎల్లూరు రేగుమాన్‌గడ్డ తీరం

కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి (కేఎల్‌ఐ) ఓవైపు నిధుల కొరత వెంటాడుతుంటే.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. సరిపడా నిధుల కేటాయింపు లేక మరమ్మతు పనుల్లోనూ జాప్యం నెలకొంది. కేఎల్‌ఐ ద్వారా నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని కొల్లాపూర్‌, అచ్చంపేట, నారగ్‌కర్నూల్‌, కల్వకుర్తి, వనపర్తి, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో 27 మండలాల్లో 4,24,816 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి ఎల్లూరు జలాశయం ద్వారా మిషన్‌ భగీరథకు తాగునీరు అందిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పథకంపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కృష్ణానదికి వరద వచ్చిన మొదట్లో 2014 అక్టోబర్‌లో ఎల్లూరు లిఫ్ట్‌ ముంపునకు గురైంది. తర్వాత 2020 అక్టోబర్‌ 17న మరోసారి మునిగిపోయింది. 1, 2, 4వ మోటార్లకు మరమ్మతులు చేశారు. పూర్తిగా దెబ్బతిన్న 3వ మోటారుకు మాత్రం ఇప్పటి వరకు మరమ్మతులు లేవు. ఇక సాంకేతిక సమస్యలతో 5వ మోటారు సక్రమంగా పని చేయడం లేదు. ప్రస్తుతం 1, 2, 4వ మోటార్ల ద్వారా మాత్రమే వరద జలాల ఎత్తిపోత కొనసాగుతోంది.


లిఫ్ట్‌లో ఏర్పాటు చేయని 3వ మోటారు

ప్రమాదకర పరిస్థితులు
ఎల్లూరు లిఫ్ట్‌ దగ్గర ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా నదికి వరద వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో తిరుగు జలాలు రేగుమాన్‌గడ్డ తీరంలోకి భారీగా చేరాయి. ఇక్కడ నిర్మాణం చేసిన సొరంగం ముందర ఇప్పటి వరకు గేటు ఏర్పాటు చేయలేదు. నేరుగా తిరుగు జలాలు సొరంగం నుంచి సర్జ్‌పూల్‌లోకి చేరుతున్నాయి. దీనివల్ల రెండు సార్లు పంపు మోటార్లు మునిగిపోయాయి. సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడే కేఎల్‌ఐలోని ఎల్లూరు లిఫ్ట్‌ నిర్వహణ అధ్వానంగా మారింది. రెండు నెలల కిందట పంపుహౌస్‌లోకి కార్మికులను తీసుకెళ్లే లిఫ్ట్‌ పాడైనా ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్‌కు తీగలు ఇనుప బకెట్‌కు కట్టి కార్మికులను, సిబ్బందిని వంద మీటర్ల లోతులో ఉన్న పంపుహౌస్‌లోకి చేరవేస్తున్నారు. కార్మికులు లోపలికి వెళ్లడానికి భయపడుతున్నారు.

ఈనాడులో కథనాలు వచ్చినా...
ఎల్లూరు లిఫ్ట్‌లో ప్రమాదకర పరిస్థితులు, నిర్వహణ లోపంపై పలుమార్లు ఈనాడులో కథనాలు వచ్చాయి. ఈ ఏడాది  జులై 4న ‘ఎత్తిపోతలకు మరమ్మతులు.. క్రేన్‌ సాయంతో ఎల్లూరు పంపుహౌస్‌లోకి కార్మికులు’ శీర్షికన కథనం ప్రచురించినా అధికారులు అప్రమత్తం కావడం లేదు. క్రేన్‌ సాయంతోనే కార్మికులను పంపుహౌస్‌లోకి చేర్చుతున్నారు. ఉదయం లోపలికి వెళితే.. మళ్లీ 12 గంటల తర్వాత సాయంత్రం బయటకు వస్తున్నామని ఎల్లూరు లిఫ్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ డీఈ లోకిలాల్‌ మాట్లాడుతూ.. ఎల్లూరు లిఫ్ట్‌లో 3వ మోటారు మరమ్మతులకు చర్యలు చేపట్టామని, అందుకు అవసరమైన సామగ్రి తెప్పిస్తున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి 1, 2, 4వ మోటార్ల  ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. కార్మికుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts