logo

నాగర్‌కర్నూల్‌ వైద్య కళాశాలలో తరగతుల నిర్వాహణకు అనుమతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా వైద్య రంగంలో మరో అడుగు ముందుకుపడింది. ఇప్పటికే వైద్య కళాశాల మంజూరవగా భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ చొరవతో వేగంగా పూర్తి చేయించారు.

Published : 07 Aug 2022 05:32 IST

న్యూస్‌టుడే, కందనూలు


నాగర్‌కర్నూల్‌ :  ఉయ్యాలవాడ వద్ద పూర్తయిన వైద్య కళాశాల భవనం

నాగర్‌కర్నూల్‌ జిల్లా వైద్య రంగంలో మరో అడుగు ముందుకుపడింది. ఇప్పటికే వైద్య కళాశాల మంజూరవగా భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ చొరవతో వేగంగా పూర్తి చేయించారు. జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వసతులను, మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులను భారత వైద్య మండలి సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలలో మొదటి సంవత్సరానికి సంబంధించిన తరగతులు నిర్వహించడానికి శనివారం ఆదేశాలు జారీ చేసింది.

తొలి విడతలో 150 మందికి..
నాగర్‌కర్నూల్‌ జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలలో తొలి విడతలో 150 మంది వైద్య విద్యార్థులను భర్తీ చేయడానికి కేంద్ర వైద్య కమిషన్‌ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలలో తరగతులు ప్రారంభించేందుకు అనుమతి లభించింది. నీట్‌ పరీక్ష ఫలితాల అనంతరం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య రమాదేవి వెల్లడించారు. వైద్య కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పించడానికి పురపాలక సంఘం పరిధిలోని ఉయ్యాలవాడ వద్ద రూ. 38 కోట్లతో భవన నిర్మాణం పూర్తయ్యింది. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు హాస్టల్‌ వసతి కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీంతో పాటు మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిని 330 పడకలకు పెంచి జనరల్‌ ఆసుపత్రిగా ఉన్నతీకరించారు.

అందుబాటులోకి పీజీ కోర్సులు..
ప్రస్తుత 2022-23 విద్యా సంవత్సరంలో 150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్‌ విద్యార్థుల మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. మూడేళ్లు గడిచేలోగా స్థానిక వైద్య కళాశాలలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో జనరల్‌ ఆసుపత్రిని 650 పడకల స్థాయికి పెంచే అవకాశాలున్నాయి. మొదటి సంవత్సరంలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి 12 మంది ప్రొఫెసర్లను, 20 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించారు. స్థానిక వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించడానికి కేంద్ర వైద్య మండలి సభ్యులు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసినట్లు జనరల్‌ ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. రఘు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మరింత మంది వచ్చే అవకాశం ఉందని జనరల్‌ ఆసుపత్రి వైద్య సిబ్బంది చెబుతున్నారు.

వనపర్తి కళాశాలకు ఎప్పుడు?
వనపర్తి : వనపర్తి జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులకు అనుమతిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. జిల్లాకు గతేడాది ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. జిల్లా సమీకృత కలెక్టరు కార్యాలయ సముదాయ భవనం వద్దనే 50 ఎకరాలు కేటాయించారు. నర్సింగ్‌ కళాశాల నిర్మాణం పనులను చక చకా పూర్తిచేశారు. అందులోనే వైద్య కళాశాలను కొనసాగించాలని నిర్ణయించారు.. కానీ కళాశాలను నడిపేందుకు కావాల్సిన కేంద్ర వైద్య కమిషన్‌ అనుమతి మాత్రం ఇంకా రాలేదు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు ఒకేసారి వైద్య కళాశాలలు మంజూరవగా, నాగర్‌కర్నూల్‌ కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి వచ్చింది. వనపర్తిది మాత్రం ఇంకా తేలలేదు. నీట్‌-2022 పూర్తయ్యింది. త్వరలోనే ఫలితాలు వచ్చి ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఇంకా అనుమతి విషయం తేలకపోవడంతో ఈ విద్యా సంవత్సరం వనపర్తి కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయా.. లేవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందం ఒకసారి వచ్చి విచారణ చేసి వెళ్లింది. రెండోసారి వస్తామని పేర్కొన్నా ఇంతవరకు రాలేదు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డిని సంప్రదించగా ఈ సంవత్సరమే వనపర్తి వైద్య కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని ఎలాంట¨ అనుమానం అక్కరలేదన్నారు.. కళాశాలల విచారణ తేదీలను బట¨్ట అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని