logo

ఓటు.. ఆధార్‌.. అనుసంధానం

ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రారంభించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 6-బీ ఫారంతో ఓటర్లే స్వయంగా ఆన్‌లైన్‌ ద్వారా వారి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకునే

Updated : 12 Aug 2022 06:26 IST

ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

ఓటరు జాబితా

న్యూస్‌టుడే గద్వాల న్యూటౌన్‌: ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రారంభించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 6-బీ ఫారంతో ఓటర్లే స్వయంగా ఆన్‌లైన్‌ ద్వారా వారి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. బోగస్‌ ఓట్ల ఏరివేత, డబుల్‌ ఓట్ల తొలగింపునకు ఆధార్‌ అనుసంధానం ఉపయోగపడనుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని, ఓటర్లు స్వచ్ఛందంగా మాత్రమే చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంటోంది.

గద్వాల జిల్లాలో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. 4,58,728 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,28,195 మంది, మహిళలు 2,30,523 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు. రెండు నియోజకవర్గాలకు ఒక వైపు కర్ణాటక, మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉండటంతో ఇక్కడి ప్రజలకు అక్కడి ప్రాంతాలతో అనుబంధం, బంధువులు ఎక్కువ. దీంతో రెండు ప్రాంతాల్లోనూ ఓటు హక్కులు కలిగి ఉన్న వారున్నారు. ఒకే గ్రామంలో డబుల్‌ ఓట్లు, నకిలీ ఓట్లు ఉన్నట్లుగా గత ఎన్నికల్లో బయట పడింది. కొందరు నాయకులు గ్రామాలు, మండలాల్లో వారికి అనుకూలమైన వ్యక్తుల పేర్లను తాము పోటీ చేసే చోట ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు.

స్వచ్ఛందంగానే అవకాశం..

పట్టణాలకు వలస వచ్చిన వారికి పురపాలికల్లో, పంచాయతీల్లోనూ ఓట్లు ఉంటున్నాయి. ఇదే సమయంలో అర్హులైన వారి పేర్లు జాబితా నుంచి మాయమవుతున్నాయి. గత ఎమ్మెల్యే, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్‌ నాడు ప్రజలు అధికారులతో గొడవకు దిగిన సంఘటనలు వెలుగు చూశాయి. మూడు నెలల క్రితం ఎన్నికల సంఘం ‘ఫోటో సిమిలర్‌ ఎంట్రీస్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఒక్కో మండలంలో 200 మందికి పైగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని పరిశీలించిన అధికారులు చాలా ఓట్లను తొలగించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేపట్టడం ద్వారా బోగస్‌ ఓట్ల లెక్క తేలిపోతుంది. అయితే ఆధార్‌ అనుసంధానం స్వచ్ఛందమే కావడంతో.. ఇంకా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కొందరు స్వచ్ఛందంగా అనుసంధాన ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

17 ఏళ్లకే ఓటు హక్కు

ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకునే వారు 18 ఏళ్లు నిండిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇలా చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి ఓటుహక్కు కల్పిస్తారు. ఇకపై 17 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది యువతకు అవకాశం లభించనుంది. అలాగే ఓటు హక్కు నమోదుకు ఏడాదికి ఒక సారి కల్పించేది. ఇకపై ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం ఏడాదికి నాలుగు సార్లు కల్పించనుంది. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు మాసాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇలా మూడు నెలలకు ఒక సారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, ఓటరు జాబితాపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండటం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని