logo

తరగతుల నిర్వహణకు అనుమతి

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అనుమతి వచ్చింది.. 2022-23 విద్యాసంవత్సరానికి కాళోజీ నారాయణరావు హెల్త్‌సైన్సెస్‌ విశ్వవిద్యాలయం, వరంగల్‌ పరిధిలోని వైద్య కళాశాలలో

Updated : 12 Aug 2022 06:32 IST

వనపర్తి వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు


నిర్మాణం పూర్తయిన భవనం

న్యూస్‌టుడే- వనపర్తి, వనపర్తి న్యూటౌన్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అనుమతి వచ్చింది.. 2022-23 విద్యాసంవత్సరానికి కాళోజీ నారాయణరావు హెల్త్‌సైన్సెస్‌ విశ్వవిద్యాలయం, వరంగల్‌ పరిధిలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులను నిర్వహించేందుకు జాతీయ వైద్య కమిషన్‌ అనుమతిని ఇచ్చింది. వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరు భవన సముదాయం వెనుక సర్వే నం.200లో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పూర్తయింది. ఎన్ఎంసీ బృందం బుధవారం జిల్లాకు వచ్చి జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, వసతులు, వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆనక అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా నీట్‌ నుంచే...

వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి రావడంతో తాజాగా నీట్‌ 2022 పరీక్ష రాసిన విద్యార్థులు 2022-23 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 150 మందికి ప్రవేశం కల్పించనున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సెలింగు నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని 330 పడకలకు పెంచి జనరల్‌ ఆసుపత్రిగా ఉన్నతీకరించారు.

ఇచ్చిన హామీ మేరకు వైద్యకళాశాల - నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వనపర్తికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఈ ఏడాదే తరగతులను ప్రారంభించనున్నాము. వైద్య కళాశాల కోసం 50ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.510 కోట్లతో కళాశాల భవనం, పరిపాలనా భవనం, విద్యార్థుల, సిబ్బంది వసతిగృహాల నిర్మాణాన్ని చేపట్టాం. వైద్య కళాశాలతో వనపర్తి రూపురేఖలే మారిపోనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావులకు వనపర్తి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని