logo

అమ్మ దూరం.. బతుకు భారం

వారికి అమ్మ తప్ప మరోటి తెలియదు. సరిగ్గా మాటలు కూడా రావు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి కన్నుమూసింది. తల్లిదండ్రులు దూరమైనా అది అర్థం చేసుకోలేని పనివాళ్లు. ఇద్దరూ అనాథలు కావటంతో వారి

Published : 12 Aug 2022 03:16 IST

అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు

న్యూస్‌టుడే, అడ్డాకుల : వారికి అమ్మ తప్ప మరోటి తెలియదు. సరిగ్గా మాటలు కూడా రావు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి కన్నుమూసింది. తల్లిదండ్రులు దూరమైనా అది అర్థం చేసుకోలేని పనివాళ్లు. ఇద్దరూ అనాథలు కావటంతో వారి భారం నిరుపేద వృద్ధురాలైన అమ్మమ్మపై పడింది. వారి భవిత ప్రశ్నార్థకంగా మారింది. మూసాపేట మండలంలోని జానంపేటకు చెందిన శివలీల(35)కు అదే గ్రామానికి చెందిన దశరథంతో వివాహమైంది. వారికి 6, 3 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రైతుల వద్ద జీతం ఉంటూ జీవనం సాగించిన దశరథం రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. ఆస్తిపాస్తులేవీ లేవు. శివలీల తండ్రి కూడా చాలా ఏళ్ల కిందటే చనిపోయాడు. వృద్ధురాలైన తన తల్లి భారతమ్మ వద్దే ఉంటూ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. రెండు రోజుల కిందట విరేచనాలతో శివలీల అస్వస్థతకు గురికావటంతో స్థానిక పీహెచ్‌సీకి వెళ్లింది. ఆమెకు టీబీ ఉన్నట్లు తేలటంతో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. శివలీల మృతితో వృద్ధురాలైన భారతమ్మ, ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. చిన్నారుల దైన్యం చూసి 2003-04 విద్యా సంవత్సరంలో శివలీలతో పాటు పదో తరగతి చదివిన సహ విద్యార్థులు రూ. 15.5వేలు ఆర్థిక సాయం అందించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు మరో రూ. 6వేలు ఇచ్చారు. చిన్న పిల్లల తల్లి అయిన కుమార్తె మృతిచెందటంతో భారతమ్మకు దిక్కు తోచటం లేదు. ఇద్దరు చిన్న పిల్లలు ఎలా పెంచి పెద్దచేయాలో అర్థం కావటం లేదని, వారి భవిష్యత్తు ఎలాగని గుండెలవిసేలా రోదిస్తోంది. ఆ చిన్నారులను చూసి గ్రామస్థులు కన్నీరుపెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని