logo

ప్రేమ జంట ఆత్మహత్య

కులాలు వేరు కావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ నరసింహ కథనం ప్రకారం...మైలార్‌దేవుపల్లిలో

Published : 12 Aug 2022 03:16 IST

రవికుమార్‌

కాటేదాన్‌, న్యూస్‌టుడే : కులాలు వేరు కావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ నరసింహ కథనం ప్రకారం...మైలార్‌దేవుపల్లిలో ఉండే జయమ్మ కుమారుడు రవికుమార్‌(20) పదో తరగతివరకు చదువుకుని ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. తండ్రి ఐదేళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తానే తల్లిని పోషిస్తున్నాడు. నివాసానికి సమీపంలో ఉండే బాలిక (17)తో ప్రేమలో పడ్డాడు. ఏడాదిన్నరగా సాగిన వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల ఇళ్లలోని వారికి తెలియడంతో  పెద్దలు మండిపడ్డారు. ఇద్దరిని కలవకుండా కట్టుదిట్టం చేశారు. వివాదం పెద్దది కావడంతో వారం క్రితం రవికుమార్‌ను తీసుకుని తల్లి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌కు వెళ్లింది. రెండురోజుల క్రితం తిరిగి వచ్చారు. బుధవారం బంధువుల ఇంట పెళ్లికి శంషాబాద్‌ వెళ్లి తల్లి అక్కడే ఉండిపోయింది. రవికుమార్‌ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈ విషయం తెలిసి బుధవారం అర్ధరాత్రి బాలిక ప్రియుడి ఇంటికెళ్లింది. ముందు వైపు తాళం వేసి, వెనకనుంచి ఇంట్లోకెళ్లిన ఇద్దరు లోపల నుంచి గడియపెట్టుకున్నారు. ఎలాగూ పెద్దలు పెళ్లిచేసుకోనివ్వరు... ఇక ఆత్మహత్యే శరణ్యమనుకున్నారేమో... వంటింట్లో దూలానికి ఒకే తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో తండ్రి అంతటా ఆరాతీశారు. అనుమానంతో తాళం వేసి ఉన్న రవికుమార్‌ ఇంటి తలుపులు తెరిచి లోనికెళ్లి చూడగా ఉరితాడుకు వేలాడుతున్న ఇద్దరిని గుర్తించి తల్లడిల్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


భార్య కాపురానికి రాలేదని బలవన్మరణం

దేవరకద్ర గ్రామీణం : భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై భగవంతరెడ్డి కథనం ప్రకారం.. దేవరకద్ర పట్టణానికి చెందిన గోపి వెంకటేష్‌(22)కి స్థానిక యువతితో రెండు నెలల కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవలు రాగా భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను కాపురానికి రమ్మని కోరగా అందుకు ఆమె అంగీకరించలేదు. గత నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించడంతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని