logo

ప్రాంగణాలు సరే.. పరికరాలేవీ?

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 319 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామానికి ఒకటి మాత్రమే కాకుండా

Updated : 19 Aug 2022 06:16 IST

యాభైశాతం దాటని  క్రీడా మైదాన నిర్మాణాలు


పెద్దమందడి బడిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం

న్యూస్‌టుడే- వనపర్తి, పెద్దమందడి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 319 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామానికి ఒకటి మాత్రమే కాకుండా అవసరమున్న చోట రెండు కూడా ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో స్థల లభ్యతను బట్టి ఒక ఎకరా, అర ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ప్రాంగణానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 145 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఇంకా యాభైశాతం పూర్తి చేయాల్సి ఉంది. క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినా పరికరాలేవీ లేకపోవడంతో నిర్మించి ఉపయోగం లేకుండా పోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..

గ్రామాల్లో  క్రీడా ప్రాంగణాలు కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు నిరాశకు లోనవుతున్నారు. అందుబాటులో ప్రాంగణాలు వుంటేనే క్రీడాకారులు, విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో అనువైన ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ఒక ఊరిలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంగణాలు మరో ఊరిలో ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

పరికరాలపై స్పష్టత కరవు

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో భాగంగా వాలీబాల్‌ కోర్టు, కబడ్డి, ఖో..ఖో.. స్తంభాలు, హారిజెంటల్‌ బార్‌, ప్యారలల్‌ బార్‌, లాంగ్‌జంప్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణాలు ఏర్పాటు చేసినా విద్యార్థులు, యువత ఆడుకోడానికి అవసరమైన క్రీడా పరికరాలు అందించలేదు. దాని విషయమై స్థానిక సర్పంచులను అడిగితే అధికారులు ఆ ఊసే ఎత్తలేదంటున్నారు. ప్రాంగణాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఈ విషయమై డీఆర్‌డీవో నర్సింహులుతో మాట్లాడగా జిల్లాలో 319 క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం 145 పూర్తయ్యాయని చెప్పారు. మిగతావి త్వరలోనే పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థలం ఉన్న చోట ఏర్పాటు చేయాలని ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో దూరమవుతోందని చెప్పారు. క్రీడాపరికరాలకు సంబంధించి ఇంకా బడ్జెటు రాలేదన్నారు.

* గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామంలో ప్రాంగణం దూరంగా ఉంది. విద్యార్థులు సమీపంలో ఉండాలని కోరుకుంటున్నారు.

* పెద్దమందడి మండలం గౌరయ్యకుంట తండాలో ప్రాంగణాన్ని కుంటలో ఏర్పాటు చేశారని, వర్షాలు ఎక్కువగా కురిస్తే ప్రాంగణమంతా నీరు నిండి ఆటలకు అవరోధంగా మారుతుందన్నారు.

* అనకాయపల్లి తండాలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంగణానికి తగిన స్థలం లేకపోవడంతో పక్కనే ఉన్న దొడగుంటపల్లిలో ఏర్పాటు చేశారని తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల పాఠశాలల్లో ఉన్న మైదానాలలోనే కొత్తగా నాలుగు ట్రాక్టర్ల మొరంమన్ను పోసి క్రీడాప్రాంగణం అయ్యిందనిపించారన్న విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని