logo

ఆదిలోనే అడ్డంకులు

ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని ఆందోళన బాటపట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ ప్రయోజనాల కోసం అన్యాయం చేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. పరిహారం మంజూరు చేయించి న్యాయం చేయాలని కోరుతూ

Published : 27 Sep 2022 01:07 IST

వైద్య కళాశాల ప్రారంభించే సమయంలో భూ వివాదం
న్యూస్‌టుడే, కందనూలు

​​​​​​​
పురపాలక సంఘం పరిధిలోని ఉయ్యాలవాడ వద్ద పూర్తయిన వైద్య కళాశాల భవనం

ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని ఆందోళన బాటపట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ ప్రయోజనాల కోసం అన్యాయం చేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. పరిహారం మంజూరు చేయించి న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించడానికి అధికారులు కసరత్తు చేపడుతున్న సమయంలో భూ వివాదం నెలకొనడం ఆందోళన కల్గిస్తోంది.
వ్యాపారుల ప్రయోజనాల కోసమే..
నాగర్‌కర్నూల్‌ పట్టణం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించడంతో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. పట్టణంలోని కొల్లాపూర్‌ చౌరస్తాలో ఆయా కార్యాలయాల భవన నిర్మాణాలకు అధికారులు భూ సేకరణ చేపట్టడంతో ఆ ప్రాంతంలో భూములకు డిమాండ్‌ పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా పుంజుకున్నది. ఇదే క్రమంలో ఏడాదిన్నర క్రితం జిల్లాకు వైద్య కళాశాల సైతం మంజూరైంది. దీంతో ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఆ గ్రామంలోని అధికార పార్టీ నాయకులు వైద్య కళాశాలను మా గ్రామంలోనే నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని 33 మంది దళిత రైతులకు చెందిన 35 ఎకరాల భూమిని సేకరించిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు బృందంగా ఏర్పడి ఒక్కో రైతుకు రూ. 6 లక్షల వరకు పరిహారం చెల్లించి ఒప్పించినట్లు ఆరోపణలున్నాయి. రైతులు వైద్య కళాశాల నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారుల వద్ద ఫారం 6(ఎ) పై సంతకాలు చేయించారు. అధికారులు పనులు ప్రారంభించి ప్రస్తుతం కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేశారు. పరిహారం చెల్లింపు విషయంలోనూ రియల్‌ వ్యాపారులు వివక్ష ప్రదర్శించి ఒక్కో రైతుకు ఒక్కోరకంగా పరిహారం చెల్లించడం అసంతృప్తికి కారణమైందని స్థానికులు విమర్శిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
వైద్య కళాశాల భూ సేకరణ విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయకుండా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కనుసన్నల్లో హడావుడిగా భూములు సేకరించడంతోనే ప్రస్తుతం వివాదాలకు దారి తీసిందని పేర్కొంటున్నారు. స్థానిక వైద్య కళాశాలలో ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు కేంద్ర వైద్య మండలి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతలో 150 సీట్లు భర్తీ చేయడానికి అవకాశం కల్పించారు. అక్టోబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అధికారులు వైద్య కళాశాలను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైద్య కళాశాల భూముల విషయంలో వివాదాలు నెలకొనడం స్థానికులను తీవ్ర ఆందోళన కల్గిస్తున్నది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధిత రైతు..
కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు మభ్యపెట్టి వైద్య కళాశాల నిర్మాణానికి భూములు అప్పగించేలా ఒత్తిడి తెచ్చినట్లు బాధిత రైతులు ఈనెల మొదటి వారంలో నిరవధిక ఆందోళనలు చేపట్టారు. రైతుల డిమాండ్లను జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే స్పందించి 33 మంది రైతులతో సమావేశమై భరోసా కల్పించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇందులో బాధిత రైతు మధు తనకున్న 2.20 ఎకరాల భూమికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని మా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు మోసం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో దావా వేశారు. దీంతో మంగళవారం న్యాయస్థానం విచారణ నిర్వహించి మధు అనే రైతు పొలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని బుధవారం జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు, ఆర్డీవో, స్థానిక తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది.


స్వచ్ఛందంగా ఇవ్వడంతోనే..
ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన 33 మంది రైతులు వైద్య కళాశాల నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇస్తూ.. రాసిచ్చారు. దీంతోనే భవనాల నిర్మాణాలను దశలవారీగా చేపట్టి పూర్తి చేశాం. ప్రస్తుతం మధు అనే రైతు మాత్రమే పరిహారం కోరుతూ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- నాగలక్ష్మి, ఆర్డీవో, నాగర్‌కర్నూల్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని