logo

ముద్ద చర్మవ్యాధితో ముప్పు

పశుసంపదకు ఆపద వచ్చింది. ప్రధానంగా తెల్లజాతి పశువులను ముద్ద చర్మ(లంపి స్కిన్‌) వ్యాధి సోకటం రైతులు, పశు సంవర్ధక అధికారులను కలవరపెడుతోంది. వర్షాలు కురవటంతో దోమలు, ఈగల బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 03 Oct 2022 04:01 IST

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వెలుగుచూస్తున్న కేసులు
అన్నదాతలు, అధికారులు అప్రమత్తమైతే మేలు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, కల్వకుర్తి న్యూటౌన్‌


వడ్డేపల్లి : కొంకల గ్రామంలో ముద్ద చర్మ వ్యాధి సోకిన దూడ

పశుసంపదకు ఆపద వచ్చింది. ప్రధానంగా తెల్లజాతి పశువులను ముద్ద చర్మ(లంపి స్కిన్‌) వ్యాధి సోకటం రైతులు, పశు సంవర్ధక అధికారులను కలవరపెడుతోంది. వర్షాలు కురవటంతో దోమలు, ఈగల బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ముద్ద చర్మ వ్యాధి సోకిన ఆనవాళ్లు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. వడ్డేపల్లి మండలం కొంకల, తెలకపల్లి మండలం జమిస్తాపూర్‌ గ్రామాలతో పాటు చాలా చోట్ల ముద్ద చర్మ వ్యాధి లక్షణాలతో పశువులు బాధపడుతున్నాయి. వాటి రక్తనమూనాలు కూడా ఇంతవరకు సిబ్బంది సేకరించలేదు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పశువైద్యశాలలు, ప్రైవేటు సిబ్బందితో వైద్యం చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులంతా అప్రమత్తం కావాల్సిన అవసరముంది. పశువుల చర్మంపై పొక్కులు, నోట్లో బొబ్బలు, జ్వరం పెరగటం వంటివి ఉన్నవేమో రోజూ గమనిస్తూ ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి వైద్యం అందేలా చూడాలి.

పశుసంవర్ధక శాఖ ఆదేశాలు : రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మార్గదర్శకాలు జారీ చేయటంతో పాటు రైతులకు సూచనలు ఇవ్వాలని పశువైద్యులను ఆదేశించింది. స్థానికంగా ఉండే పశువ్యాధి నిర్ధారణ కేంద్రాల వైద్యులకు కూడా రక్త పరీక్షలు చేపట్టాలని సూచించింది. కానీ రక్త నమూనాలు సేకరించిన దాఖలాలు మాత్రం లేవు. అనుమానం ఉన్నచోట్ల స్థానిక వైద్యాధికారులు గోట్‌పాక్స్‌ టీకాలు ఇస్తున్నారు. గతంలో ఈ టీకాలను ఇచ్చామని, ముద్దచర్మ వ్యాధి వస్తోందన్న వార్తల నేపథ్యంలో మళ్లీ వేస్తున్నామని మహబూబ్‌నగర్‌ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.మధుసూదన్‌గౌడ్‌ చెప్పారు. హైదరాబాద్‌లోనిపశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారి డా.కల్యాణిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా రైతులకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేశామన్నారు. రైతులు వ్యాధి వచ్చినట్లు అనుమానం ఉంటే వాటిని మందలో కలపకుండా దూరంగా ఉంచాలన్నారు. మండల కేంద్రాల్లోని పశువైద్యశాలల్లో యాంటి బయాటిక్స్‌, యాంటి పైరేటిక్స్‌, యాంటీ హిస్టామైన్లు, మల్టీ విటమిన్లు సిద్ధంగా ఉంచామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వ్యాధి లక్షణాలు..
* దోమలు, ఈగలు, గోమార్ల ద్వార ముద్ద చర్మ వ్యాధి వ్యాపిస్తుంది.
* పశువులు నీరసంగా మారి జ్వరం 104 డిగ్రీల వరకు ఉంటుంది.
* చర్మంపై కణతలు, దద్దుర్లు, పొక్కులు, కాళ్లల్లో వాపు కనిపిస్తాయి.
* ఆవుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. సూడి ఆవులు ఈడ్చుకుపోతాయి.
* పశువుల చర్మంపై మొదట మచ్చలు ఏర్పడుతాయి.
* మచ్చలు ఏర్పడిన చోట ఏడు రోజుల్లో చర్మం పగిలి పుండ్లు ఏర్పడుతాయి.

ఉమ్మడి జిల్లాలో తెల్లజాతి పశుసంపద
మహబూబ్‌నగర్‌ 90,324
నాగర్‌కర్నూల్‌ 2,40,301
వనపర్తి 75,689
నారాయణపేట 1,00,770
గద్వాల 72,416
ఆవులు, ఎద్దులు, దూడలు

నివారణ చర్యలు..
* పశువుల కొట్టంలో ఈగలు, దోమలు, గోమార్లు ఉండకుండా పరిశుభ్రంగా ఉంచాలి.
* వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి.
* కొత్త, ఇతర పశువులతో కలవనివ్వొద్దు. వ్యాధి సోకిన వాటికి దోమల తెరలు వాడాలి.
* వ్యాధి సోకిన పశువును రాగిజావ, నూకల జావ, పచ్చిగడ్డి, విటమిన్లను అందిస్తే నొప్పులు తగ్గుతాయి.
* జ్వరం తగ్గించుటకు, దురద, చర్మం మీద మచ్చలు తగ్గించుటకు వేర్వేరు మందులు వాడాలి.
* ఈ వ్యాధి వచ్చి చనిపోతే కళేబరాలను మట్టిలో పూడ్చాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు