logo

పండుగ ఖర్చులకు పరేషాన్‌

రోజూ కూలీ పనులకు వెళ్తేకాని కుటుంబం గడవని జీవితాలు వారివి. వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులు చేసుకొంటున్నారు. అయితే పనులు చేసినా సకాలంలో డబ్బులు అందక నానా అవస్థ పడుతున్నారు కూలీలు.

Updated : 03 Oct 2022 06:15 IST

డబ్బులు రాక ఉపాధి హామీ కూలీల అవస్థ
ఏడు వారాల వేతనాలు పెండింగ్‌
న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌

రోజూ కూలీ పనులకు వెళ్తేకాని కుటుంబం గడవని జీవితాలు వారివి. వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులు చేసుకొంటున్నారు. అయితే పనులు చేసినా సకాలంలో డబ్బులు అందక నానా అవస్థ పడుతున్నారు కూలీలు. దసరా పండుగ కేవలం రెండ్రోజులే ఉన్నా పిల్లలను కొత్త దుస్తులు తెచ్చుకోలేదు. పిల్లలకు దుస్తులు మాట అటుంచి.. కనీసం పండుగ సరకులు ఎలా తెచ్చుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి వారానికి ఒకసారి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. జిల్లాలో కొందరికి అయిదు వారాలు, మరికొందరికి ఏడు వారాల డబ్బులుగా డబ్బులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే చెల్లిస్తే దసరా పండుగను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటామని అంటున్నారు.

రూ. 3.28 కోట్ల బకాయిలు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ బిల్లులు సుమారు రూ.3.26 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిలో సామగ్రి రూపేణా అందాల్సిన బకాయిలే రూ.2.82 కోట్లు ఉన్నాయి. కూలీల బకాయిలు రూ.44 లక్షలు, మేటీలకు రూ.2.42 లక్షలు చెల్లించాల్సి ఉంది. మక్తల్‌ మండలంలో అత్యధికంగా కూలీలకు రావాల్సింది రూ.13.83 లక్షలు, మెటీరియల్‌ పనులకు రూ.58.87 లక్షలు బకాయిలు ఉన్నాయి. మాగనూరు మండలంలో కూలీలకు రూ.4.07 లక్షలు, మరికల్‌ మండలంలో రూ.4.83 లక్షలు, ధన్వాడలో రూ.3.74 లక్షలు, నర్వలో రూ.3.57 లక్షలు.. ఇలా ప్రతి మండలంలోనూ రూ.లక్షల్లో బకాయిలు ఉన్నాయి. ఒక్క కోస్గిలో మాత్రమే కేవలం రూ.51 వేలు మాత్రమే కూలీలకు అందాల్సి ఉంది. చేసిన పనికి డబ్బుల  కోసం కూలీలతో పాటు పంచాయతీ సర్పంచులు ఎదురుచూస్తున్నారు. సర్పంచులు సామగ్రి కింద సీˆసీˆ రోడ్లు వేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టారు. ఈ నిధులన్నీ సర్పంచులకు అందాల్సి ఉంది. చేబదులు, అప్పులు తెచ్చి పనులు చేశామని, బకాయిలు రాకపోవడంతో వడ్డీ పెరుగుతోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమీపిస్తున్నా నిధులు జమ కాకపోవడంతో కూలీలు కూడా ఆందోళన చెందుతున్నారు.


రాంకిష్టాయపల్లి శివారులో మొక్కల సంరక్షణ పనులు నిర్వహిస్తున్న కూలీలు

నిధులు రావాల్సి ఉంది..
ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన బకాయి నిధులు విడుదల కాలేదు. ఈ పాటికే రావాలి. ఎందుకు జాప్యం అయిందో తెలియడం లేదు. కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో జమ అవుతాయని చెబుతున్నారు. నిధులు విడుదల కాగానే వారి వారి ఖాతాల్లో జమ అవుతాయి.

- గోపాల్‌నాయక్‌, డీఆర్డీవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని