logo

పాలమూరు ధాన్యానికి డిమాండ్‌

ఈసారి సన్నరకం వడ్లకు డిమాండు పెరగడంతో వ్యాపారులు పోటీపడి ఖరీదు చేస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,060 ఉండగా వ్యాపారులు శనివారం దేవరకద్రలో వ్యాపారులు శ్రీరాం గోల్డ్‌ రకం ధాన్యానికి ఏకంగా రూ. 2,521 చెల్లించారు.

Published : 27 Nov 2022 04:21 IST

న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, దేవరకద్ర

ఈసారి సన్నరకం వడ్లకు డిమాండు పెరగడంతో వ్యాపారులు పోటీపడి ఖరీదు చేస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,060 ఉండగా వ్యాపారులు శనివారం దేవరకద్రలో వ్యాపారులు శ్రీరాం గోల్డ్‌ రకం ధాన్యానికి ఏకంగా రూ. 2,521 చెల్లించారు. బాదేపల్లి మార్కెట్‌లో వ్యాపారులు రూ. 2,424 ధరతో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం కొనుగోలు చేశారు. మహబూబ్‌నగర్‌లో రూ. 2,334 ధర చెల్లించారు. జడ్చర్లలోని నాలుగు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కేవలం 22వేల బస్తాల ధాన్యం ఖరీదు చేయగా, మార్కెట్‌లో వ్యాపారులు అధిక ధరతో 98,765 బస్తాలు కొన్నారు. గతేడాది కంటే పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండటం చర్చనీయాంశమైంది.
నాణ్యత ఉండటమే కారణం : ఉమ్మడి జిల్లాలో ఈసారి సన్నరకం ధాన్యం నాణ్యత బాగుంది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి, నాణ్యత తగ్గాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మిల్లర్లతో పాటు, ఇతర ప్రాంతాల వ్యాపారులు బాదేపల్లి, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర మార్కెట్లలో ఎక్కువగా పంట కొనుగోలు చేస్తున్నారు. బాదేపల్లి మార్కెట్‌కు నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండటం విశేషం. రెండు వారాలుగా ధాన్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ధాన్యం తేమశాతం కొంత ఎక్కువగా ఉన్నా పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు ఎగుమతుల కోసం ఎక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 5వేల క్వింటాళ్ల ధాన్యం ఖరీదు చేస్తుండటం విశేషం. గతేడాది మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మర ఆడించి బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉండగా చాలా మంది విఫలమయ్యారు. దీంతో ఈసారి ప్రభుత్వం ఆయా మిల్లర్లకు ధాన్యం ఇవ్వడానికి నిరాకరిస్తోంది. వ్యాపారులే ముందుకొచ్చి ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇది కూడా కారణమని తెలుస్తోంది.

ధర పెరిగే అవకాశం : గతేడాది వ్యాపారులు సన్నరకం ధాన్యానికి రూ. 2,100 మించి ధర చెల్లించలేదు. ఈసారి రూ. 2,400 చెల్లిస్తున్నారు. మరో రూ. 100 పెరిగే అవకాశం ఉందని ఉన్నాయని మార్కెట్‌లోని కమీషన్‌ ఏజెంటు గోవింద్‌రాం పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే డబ్బులు ఖాతాలో జమ కావడానికి వారానికి పైగా వేచిచూడాల్సి వస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అదే రోజే చెల్లిస్తుండటంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు. జడ్చర్లలోని 4 కొనుగోలు కేంద్రాల్లో గతేడాదితో పోలిస్తే రైతులు తక్కువ విక్రయిస్తున్నారని బాదేపల్లి పీఏసీఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌గౌడ్‌, యాదగిరి తెలిపారు. మెరుగైన ధరలు రావటంతో రైతులు ఆనందిస్తున్నారని మార్కెట్‌ కార్యదర్శి నవీన్‌కుమార్‌ తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని