logo

వైద్యం పెనుభారం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ వ్యాధుల నివారణకు రోగులు ఏటా సుమారు రూ.731.33కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటూ వైద్యం కోసం భారీగా డబ్బు వెచ్చిస్తున్నారు.

Updated : 27 Nov 2022 04:50 IST

ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.731 కోట్లకుపైగానే ఖర్చు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ వ్యాధుల నివారణకు రోగులు ఏటా సుమారు రూ.731.33కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటూ వైద్యం కోసం భారీగా డబ్బు వెచ్చిస్తున్నారు. తమ సంపాదనలో సింహభాగం విద్యానికే ఖర్చు చేస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పాలమూరు జిల్లాల్లో ఏటా సుమారు రూ.568.24కోట్లు తాము దాచుకున్న డబ్బు నుంచే వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2021లో వెల్లడైంది. ఎన్‌సీడీ అధికారుల నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లాలో 1.07 లక్షల మంది రక్తపోటు, 60,298 మంది మధుమేహం, 608 మంది క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్నారు. మరో 25 వేల మంది క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

పేద, మధ్య తరగతి వర్గాలే ఎక్కువ..

తాజా గణాంకాల ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 37 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 80శాతం  పేద, మధ్య తరగతి వర్గాలే. 9 లక్షల రైతు కుటుంబాలు, 10 లక్షలు వలస కార్మికులు ఉన్నారు. వివిధ వృత్తులు  చేసుకునే వారు మరో 12 లక్షల మంది ఉంటారు. జిల్లాల్లో పేదలు కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో కొందరు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వైద్యులు వివిధ పరీక్షలు, ప్రతి నెల ఔషధాల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేయిస్తున్నారు. ప్రధానంగా క్యాన్సర్‌, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గ్రామీణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నా.. ఇతర మందులకు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు వెళ్తున్నారు.  

జీవనశైలి మారడంతో..

జీవన శైలి మారడంతో ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా మహిళలు గైనిక్‌ సమస్యల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి సంవత్సరం రూ.100కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. పిల్లలు లేకపోవడం, నెలసరి సమస్యలకు డబ్బు ఖర్చు చేస్తున్నారు.
* ఉమ్మడి జిల్లాలో ఏడాదికి 64వేల కాన్పులు అవుతున్నాయి. వీటిలో 45వేల కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రతి కాన్పుకు అదనంగా రూ.6,808 అదనంగా సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఏటా కాన్పుల కోసం రూ.30.06కోట్లు ఖర్చు అవుతున్నాయి.
* ఆ తర్వాత ఎక్కువగా జీర్ణకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోపోవడం, ధూమపానం, మద్యపానంతో గ్యాస్ట్రిక్‌ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
* పాలమూరులోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఆరోగ్య బీమా వర్తించకుండా 11.02 లక్షల మంది ఉన్నారు. పట్టణాల్లో 19.11 లక్షల మంది ఉన్నారు.
* ప్రభుత్వ బీమా పొందుతున్న వారిలో గ్రామాల్లో 25.71 లక్షలు, పట్టణాల్లో 14.17 లక్షల మంది ఉన్నారు.

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని