logo

ఆకలితో నీరసించి అస్వస్థత

మహబూబ్‌నగర్‌ జిల్లా మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థినులు ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.

Updated : 27 Nov 2022 04:54 IST

పురుగుల అన్నం పెడుతున్నారని భోజనం మానేసిన విద్యార్థినులు  

ఆరోగ్య కేంద్రానికి వచ్చిన విద్యార్థినులు.. చికిత్స పొందుతున్న బాలికలు

మహమ్మదాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థినులు ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం వసతిగృహంలో వడ్డించిన అల్పాహారంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తినలేకపోయారు. పాఠశాలకు వెళ్లాక కళ్లు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు నీరసంతో పడిపోయారని తెలిపారు. వారం రోజుల నుంచి ఉదయం అల్పాహారం, రాత్రి భోజనంలో పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. అల్పాహారం, అన్నంలో పురుగులు వస్తున్నాయని వంటవారికి చెబితే తీసేసి తినమన్నారని వాపోయారు. వార్డెన్‌ రెండు రోజులకోసారి వసతిగృహానికి వస్తారని, వంటలు బాగాలేవని చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలిసిన ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ యాదయ్య, తహసీల్దార్‌ ఆంజనేయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీడీ యాదయ్యను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని, వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని