logo

వేధిస్తున్న రక్తహీనత

పండంటి బిడ్డను కడుపులో మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయానికి ముందే రక్తహీనతతో బాధపడుతున్నారు.

Updated : 29 Nov 2022 06:15 IST

పౌష్టికాహార లోపంతో గర్భిణుల అవస్థలు


వనపర్తిలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన గర్భిణులు

న్యూస్‌టుడే, వనపర్తి న్యూటౌన్‌: పండంటి బిడ్డను కడుపులో మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయానికి ముందే రక్తహీనతతో బాధపడుతున్నారు. నెలలు నిండుతున్న సమయంలో పౌష్టికాహారం తీసుకోకపోవడం, పూట గడవడానికి కూలి పనులకు వెళ్తున్న ఎందరో మహిళలకు ఈ సమస్య ఎదురవుతోంది. రక్తం తక్కువ ఉందని, సాధారణ ప్రసవం కావాలంటే రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్న సందర్భాలూ ఎన్నో ఉంటున్నాయి. రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో శిశువుకు జన్మనిచ్చిన మాతృమూర్తులు కన్నుమూస్తున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపధ్యంలో తల్లీబిడ్డల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని  పెంచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఆరోగ్యలక్ష్మీ పేరిట సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. పోషకాహార లోపంతోనే గర్భిణులు రక్తహీనతకు లోనవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
పోషకాహారం పంపిణీ, అవగాహన : ప్రతి బుధవారం ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఉచితంగా పరీక్షలు చేసిన అనంతరం రక్తహీనత సమస్యను అధిగమించేందుకు వైద్య సిబ్బంది ఐరన్‌ మాత్రలు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సరఫరా చేస్తున్నారు. గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. అయినా అత్యధికుల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది. గర్భిణుల్లో రక్తహీనత వేధిస్తోంది. మరోవైపు పలువురు వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం లేదు. ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మాత్రలను కూడ సక్రమంగా వాడడం లేదు. జిల్లావ్యాప్తంగా అధికారిక సమాచారం ప్రకారం 3,832 మంది గర్భిణులు ఉన్నారు. వీరిలో 748 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు గర్భం దాల్చిన నెల నుంచే తీసుకోవాల్సిన పోషకాహారం గురించి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా సరైన అవగాహన లేకపోవడంతోనే ఎక్కువ మంది కాబోయే అమ్మలు అందుబాటులో ఉన్న పోషకాహారాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా రక్తహీనతకు లోనవుతూ ప్రసవ సమయంలో ప్రయాస పడుతున్నారు.


పోషకాహారం తప్పనిసరి..

- అరుణకుమారి, మాతా శిశుసంరక్షణ వైద్యాధికారి

బాలికలకు చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం, గర్భంతో ఉన్న సమయంలో పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల పలువురు గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో అందుబాటులో రక్తం లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సాధ్యమైనంతగా పోషకాహారం తీసుకోవాలి. ప్రతి పీహెచ్‌సీ పరిధిలోని వైద్య సిబ్బంది, అంగన్‌వాడి కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన కల్పించాలని చెప్పాం. ప్రభుత్వం సరఫరా చేసే బాలామృతం, ఆరోగ్య లక్ష్మీ తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని