logo

విద్యావనరుల కేంద్రాలకు నిధులు

ప్రతి రోజూ రిపోర్టుల తయారీ, రిజిష్టర్ల నిర్వహణ, అంతర్జాల వినియోగం ఇలా అన్ని రకాలుగా మండల విద్యావనరుల కేంద్రం(ఎమ్మార్సీ), క్లస్టర్‌ పాఠశాల సముదాయం(సీఆర్సీ) పనులు జరుగుతున్నాయి.

Published : 29 Nov 2022 03:05 IST

ఉమ్మడి జిల్లాకు మొదటి విడతగా రూ.58.90 లక్షలు మంజూరు


వడ్డేపల్లిలోని ఎమ్మార్సీ కార్యాలయం

న్యూస్‌టుడే గద్వాల న్యూటౌన్‌: ప్రతి రోజూ రిపోర్టుల తయారీ, రిజిష్టర్ల నిర్వహణ, అంతర్జాల వినియోగం ఇలా అన్ని రకాలుగా మండల విద్యావనరుల కేంద్రం(ఎమ్మార్సీ), క్లస్టర్‌ పాఠశాల సముదాయం(సీఆర్సీ) పనులు జరుగుతున్నాయి. వీటికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాకు మొత్తం రూ.1.17 కోట్లు కేటాయించగా ఇందులో 50 శాతం నిధులు రూ.58.90 లక్షలు మంజూరు చేసింది. వీటిలో ఎస్సీ కాంపోనెంట్‌ కింద 24 శాతం, ఎస్సీ కాంపోనింట్‌కు 14 శాతం, జనరల్‌ కేటగిరి కింద 62 శాతం ఉన్నాయి. ఈ నిధులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యా వనరుల కేంద్రాలకు ఊరట కలిగింది. వచ్చిన నిధుల ఖర్చుకు సంబంధించిన బిల్లులను పీఎఫ్‌ఎమ్‌ఎస్‌(పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)లో అప్‌లోడ్‌ చేసి వినియోగించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఆయా మండలాల పరిధిలో పాఠశాలల నిర్వహణ ఎమ్మార్సీల ద్వారా నిర్వహిస్తున్నారు. ఏటా ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున అయిదు జిల్లాల పరిధిలో మొత్తం 55 ఎమ్మార్సీలకు ఈ విద్యా సంవత్సరం రూ.49.50 లక్షలు కేటాయించారు. ఇందులో 50 శాతం అంటే రూ.24.75 లక్షల నిధులు మంజూరయ్యాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 16 ఎమ్మార్సీలు ఉండగా, రూ.7.20 లక్షలు మంజూరయ్యాయి. ఏటా ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు కేటాయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 207 సీఆర్సీలకు రూ.68.31 లక్షల నిధులు కేటాయించగా, ఇందులో ప్రస్తుతం రూ.34.15 లక్షలు మంజూరయ్యాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 57 సముదాయాలకు రూ.9.40 లక్షలు మంజూరవగా, తక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలోని 29 సముదాయాలకు రూ.4.78 లక్షలు మంజూరయ్యాయి.

కొత్త మండలాలకు కేటాయింపులేవి? : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 కొత్త మండలాలున్నాయి. వీటిలో ఎమ్మార్సీ కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. వాటికి నిధుల కేటాయింపు మాత్రం చేపట్టలేదు. దీంతో ఆ మండలాల్లో ఎమ్మార్సీల నిర్వహణ ఇప్పట్లో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీని ప్రభావం ఆయా మండలాల విద్యా వ్యవస్థపై పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని