logo

ప్రజలకు భారం.. పురపాలికలకు ఆదాయం

ప్రభుత్వం ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంతాల జనాభా పది వేల ఓటర్లపైగా ఉంటే వాటిని పురపాలికలుగా గుర్తింపు ఇచ్చింది. పురపాలికలుగా మారిన తర్వాత రెండేళ్లు పరిస్థితి సవ్యంగా ఉన్నా..

Updated : 29 Nov 2022 06:14 IST

వడ్డేపల్లి పురపాలికలో పన్ను వసూలు చేస్తున్న పుర సిబ్బంది

న్యూస్‌టుడే, ధరూరు, శాంతినగర్‌: ప్రభుత్వం ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంతాల జనాభా పది వేల ఓటర్లపైగా ఉంటే వాటిని పురపాలికలుగా గుర్తింపు ఇచ్చింది. పురపాలికలుగా మారిన తర్వాత రెండేళ్లు పరిస్థితి సవ్యంగా ఉన్నా.. ప్రస్తుతం ఇళ్ల యజమానుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. పురపాలికగా మారి అభివృద్ధికి అడుగులు పడ్డాయని సంతోష పడాలో లేక పన్నుల మోతతో సతమతం అవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో ఉన్న పన్నుకు ఇప్పటి పన్నుకు చాలా వ్యత్యాసం ఉండటంతో తమకు కష్టాలు తప్పటం లేదని పుర ప్రజలు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మక్తల్‌, కోస్గి, అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, భూత్పూరు, అలంపూర్‌, వడ్డేపల్లి పంచాయతీలు కొత్తగా పురపాలికలుగా ఏర్పాటయ్యాయి. ఉదాహరణకు వడ్డేపల్లి పంచాయతీలో గతంలో రూ.23 లక్షల వరకు ఏడాదికి పన్ను వసూలయ్యేది. తాజాగా పురపాలికగా ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు పన్ను మినహాయింపు ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి కొత్త పన్నులు చేస్తుండగా రూ.1.50 కోట్లు వచ్చినట్లు పురపాలిక సిబ్బంది సమాచారం బట్టి తెలుస్తుంది. గతంలో ఉన్న పన్ను ఆదాయంతో పోలిస్తే ఏడింతలు పెరిగింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది పురపాలికల పరిధిలో గతంలో వసూలయ్యే పన్ను రూ.2.50 కోట్లు. పురపాలికలుగా ఏర్పడిన తర్వాత వసూలు చేస్తున్న పన్ను రూ.11.25 కోట్ల వరకు ప్రజలు కట్టాల్సి వస్తోంది.


రూ.6 వేలు వచ్చింది : గతంలో 800 చదరపు అడుగులు ఉన్న గృహానికి రూ.600 చెల్లించా. పురపాలిక ఏర్పడిన తర్వాత రూ.6,478 పన్ను విధించారు. తొమ్మిదింతలు పన్ను పెంచటంతో భారంగా మారింది. పనులు ఒకేసారి ఇంత మొత్తంలో పెంచకుండా విడతలవారీగా పెంచితే బాగుంటుంది.

- వెంకటనారాయణ, వడ్డేపల్లి పురపాలిక


అమల్లోకి నూతన విధానం ; పురపాలిక చట్టంలో మార్పులతో కొత్త విధానం నూతన పురపాలికల్లో అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శ్లాబుల ప్రకారం పన్ను విధానం ఉంటుంది. కొత్త పన్ను విధానం ప్రకారం వసూలు చేస్తున్నాం.

- నిత్యానంద్‌, వడ్డేపల్లి పురపాలిక కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని