logo

నాలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌లో నాలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలిక కమిషనర్‌ డి.ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్‌, ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.

Published : 20 Jan 2023 06:14 IST

మహబూబ్‌నగర్‌ పురపాలిక కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌లో నాలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలిక కమిషనర్‌ డి.ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్‌, ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ముఖ్యంగా హరిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. రెండేళ్లుగా కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలివి.

న్యూస్‌టుడే, పాలమూరు పురపాలకం

ప్రశ్న : పెద్దచెరువు, లక్ష్మీనగర్‌కాలనీ వాగుల పొడవునా బఫర్‌జోన్‌ను ఆక్రమించి ప్రహరీలు, పెన్షింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల భవనాలే వెలుస్తున్నాయి. చర్యలు తీసుకోరా?
సమాధానం : నాలాల ఆక్రమణలను ఉపేక్షించే పరిస్థితి లేదు. నీటి పారుదల, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుని పురపాలక శాఖ ఆధ్వర్యంలో నాలాల ఆక్రమణలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఆక్రమణలకు పాల్పడి ఉంటే గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఫిర్యాదు చేయొచ్చు.

ప్ర: పాలమూరును హరిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి పనులు చేపడుతున్నారు?  
స : గతంలో ఇతర ప్రాంతాల్లో మొక్కలు కొనుగోలు చేసి నాటేవాళ్లు. నేను వచ్చాక ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేయించాను. రూ. 1.50 కోట్ల వ్యయంతో 16 నర్సరీల్లో లక్ష మొక్కలు పెంచి 8, 9 విడతల హరితహారంలో ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల వెంట నాటాం. అవి చెట్లుగా ఎదిగి పట్టణానికి కొత్త అందాన్ని ఇవ్వటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.

ప్ర : పట్టణంలో అనుమతి లేకుండా, టీఎస్‌ బీపాస్‌ నియమాలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి పరిస్థితేంటి?
స : కొత్త చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటే పర్యవేక్షణ చేస్తుంది. టీఎస్‌ బీపాస్‌ అమల్లోకి వచ్చాక ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందుతున్నారు. అయినా పురపాలిక పట్టణ ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయికి వెళ్లి భవన అనుమతులు పరిశీలిస్తున్నారు. నిబంధనలు, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.

ప్ర : కూడళ్ల విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయి?
స : గతంలో పాలమూరు కూడళ్లు ఇరుకుగా ఉండి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యేవి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహకారంతో మొత్తం 12 కూడళ్లను విస్తరించి ఆధునీకరిస్తున్నాం. ముఖ్యంగా అంబేడ్కర్‌, వన్‌టౌన్‌, అశోక్‌ టాకీస్‌, న్యూటౌన్‌, తెలంగాణ, మెట్టుగడ్డ, సద్దలగుండు, ఆర్‌అండ్‌బీ కూడళ్లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాం.  

ప్ర : పెద్దచెరువు ముంపు ప్రాంతాల పరిస్థితేంటి? రాబోయే రోజుల్లోనూ ఇలాగే ఉంటుందా?
స : పెద్దచెరువు పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం. రూ. 3కోట్ల నిధులతో రామయ్యబౌలి అలుగు నుంచి భూత్పూర్‌ రహదారి వంతెన వరకు పెద్ద కాలువ నిర్మిస్తున్నాం. బీకేరెడ్డికాలనీ అలుగు వైపు కూడా మరో రూ. 5కోట్ల నిధులతో ఇలాంటి పెద్ద కాలువ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి చెరువు రెండు అలుగుల వైపు ఎలాంటి ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.

ప్ర : మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రం కమీషన్‌ పక్కదారి పట్టిన వ్యవహారం వెలుగు చూసింది. డబ్బులు రికవరీ చేస్తున్నారా?
స : ఈ వ్యవహారాన్ని అదనపు కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు. వెంటనే విచారణ అధికారిని నియమించగా నివేదిక కూడా వచ్చింది. కమీషన్‌ డబ్బులు తీసుకున్న మహిళల నుంచి రికవరీ చేయాలని, కొనుగోలు కేంద్రాలను ఇతర సంఘాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఇటీవల పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చిన కమీషన్‌ చెక్కును నిలిపివేశారు.

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని