logo

అనుమతులు లేకుండానే అమ్మేస్తున్నారు

పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతాలు స్థిరాస్తి వ్యాపారులకు అక్షయ పాత్రగా మారాయి. పురపాలిక శివారులోని భూములను కొనుగోలు చేస్తూ అనుమతులు రాకున్నా చదును చేసి ప్లాట్లను ప్రజలకు అంటగడుతున్నారు.

Published : 22 Jan 2023 05:11 IST

కల్వకుర్తి సమీపంలో ఏర్పాటు చేసిన వెంచరు

కల్వకుర్తి, న్యూస్‌టుడే : పురపాలిక పరిధిలోని శివారు ప్రాంతాలు స్థిరాస్తి వ్యాపారులకు అక్షయ పాత్రగా మారాయి. పురపాలిక శివారులోని భూములను కొనుగోలు చేస్తూ అనుమతులు రాకున్నా చదును చేసి ప్లాట్లను ప్రజలకు అంటగడుతున్నారు. కేంద్రప్రభుత్వం జాతీయ రహదారి నిర్మాణానికి ప్రకటన వెలువరించడంతో వెంచర్ల ఏర్పాటు ఊపందుకొంది. అచ్చంపేట పరిధిలో శ్రీశైలం - హైదరాబాద్‌ రహదారి, కల్వకుర్తి పరిధిలో కోదాడ - రాయచూర్‌ జాతీయ రహదారి, కొల్లాపూర్‌ పరిధిలో కర్వెన - కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ పరిధిలో శ్రీశైలం - మహబూబ్‌నగర్‌ రహదారులు విస్తరించాయి. ఈ నాలుగు పురపాలికల్లో జాతీయ రహదారుల వెంట ఉండటం స్థిరాస్తి వ్యాపారులకు కలిసొచ్చింది. హైదరాబాద్‌ రియల్టర్ల చూపంతా కల్వకుర్తిపైనే పడింది. కల్వకుర్తి పురపాలిక పరిసరాల్లో ఎక్కడ ఎకరా భూమి కొనాలన్నా రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు వ్యయం చేయాల్సిందే. 2022లో కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ పురపాలికల్లో 210 ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి. 150 ఎకరాల్లో అనుమతులు లేకుండా వెంచర్లు నిర్వహిస్తుండటం గమనార్హం. అయినా.. అధికారులు చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.

దరఖాస్తు చేశామని..

వ్యవసాయేతర భూమిగా మార్చటానికి నాలా అనుమతుల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాల్సి ఉంది. చలానా తీసి డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాలన్న నిబంధనలున్నాయి. అనంతరం డీటీసీపీ లేఆవుట్‌ అనుమతికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వెంచర్లలో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు సౌకర్యం సమకూర్చిన తరవాతే స్థలాల అమ్మకం ప్రారంభించాలి. కానీ నాలా అనుమతులకు దరఖాస్తు చేశామని చెబుతూ. స్థలాలను విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు.

* జిల్లా కేంద్రం నాగర్‌కర్నూల్‌లో 2022లో 10కి పైగా వెంచర్లు వెలిశాయి. అనుమతులు వచ్చాక ప్లాట్ల అమ్మకాలకు అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 60 ఎకరాల్లో కొత్త వెంచర్ల ఏర్పాటు జోరుగా సాగుతోంది.

* కల్వకుర్తి పురపాలికలో 105 మంది స్థిరాస్తి వ్యాపారులు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా పూర్తి స్థాయిలో దస్త్రాల పరిశీలన అనంతరమే అందరికి అనుమతులు ఇచ్చినట్లు తహసీల్దార్‌ రాంరెడ్డి తెలిపారు.

* అచ్చంపేట పురపాలికలో ఒక వెంచరుకు అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్పటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంచర్ల బోర్డులు రహదారుల వెంట దర్శనమిస్తున్నా.. వెంచర్లు లేవని చెప్పటం అక్కడ స్థిరాస్తి వ్యాపారం కొనసాగటం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిజిస్ట్రేషన్లు చేయటం లేదు..

వివాదాస్పద లేఅవుట్‌లో పట్టాలు చేయటానికి అనుమతులు ఇవ్వటం లేదు. కోర్టు అనుమతి ఉందంటున్నారే తప్పా, వాటిని సైతం పక్కన పెట్టేశాం. పురపాలిక పరిధిలో డీటీసీపీ అనుమతులు వచ్చిన వాటికే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. అనుమతులు లేని వాటికి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు.

ప్రకాశ్‌, ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రారు, కల్వకుర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని