logo

ఉదండాపూర్‌ నిర్వాసితులకు మరో చిక్కు

పరిస్థితులను ముందుగా అంచనా వేయకుండా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్‌ జలాశయం నిర్వాసితులకు వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి.

Published : 25 Jan 2023 02:23 IST

తండాల్లోని ఇళ్లకు తక్కువగా పరిహారం మంజూరు
న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం

జడ్చర్ల మండలంలోని చిన్నగుట్టతండా

రిస్థితులను ముందుగా అంచనా వేయకుండా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్‌ జలాశయం నిర్వాసితులకు వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదివరకు ఇళ్ల పరిహారంలో అవకతవకలు జరిగాయని వెలుగులోకి రాగా వాటిని సరిచేసేందుకు క్షేతస్థాయి పరిశీలన చేసి నివేదిక పంపించారు. కొత్తగా మరికొన్ని చిక్కులు వచ్చాయి. ముంపునకు గురవుతున్న ఐదు తండాల్లో ఇళ్లను గజాల్లో కాకుండా గుంటల్లో లెక్కించి పరిహారం మంజూరు చేయటం నిర్వాసితులను ఆవేదనకు గురిచేస్తోంది.

అడ్డొస్తున్న నిబంధనలు : ఉదండాపూర్‌ జలాశయంలో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్‌, వల్లూరు గ్రామాల పరిధిలోని తుమ్మలకుండతండా, రాగడిపట్టితండా, ఒంటిగుట్టతండా, శామగడ్డతండా, చిన్నగుట్టతండాలు ఉన్నాయి. ఉదండాపూర్‌, వల్లూరు గ్రామాల్లోని నిర్వాసితుల్లాగే ఐదు తండాల్లోని గిరిజనుల ఇళ్లకు పరిహారం చెల్లించేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయి. పరిహారం పంపిణీకి జలాశయం పరిధిలోని రెండు గ్రామాలు, 5 తండాల్లో కలిపి మొత్తం 2,850 ఇళ్లు ఉన్నట్లు గుర్తించి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. సాధారణంగా గిరిజన తండాల్లోని ఇళ్లు వ్యవసాయ భూముల్లో దూరం దూరంగా ఉంటాయి. పరిహారం ఇవ్వాలంటే గృహాలు ఉన్నది ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలమో, గ్రామకంఠమో అయి ఉండాలి. గిరిజన తండాల్లో ఈ రెండూ లేవు. పైగా అక్కడి ఇళ్లు, వాకిళ్లు చాలా విస్తీర్ణంలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించదు. దీంతో అధికారులు వ్యవసాయ భూముల్లాగే ఇళ్లను గుంటలు, ఎకరాల్లో లెక్కగట్టి పరిహారం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే తుమ్మలకుంటతండా వారికి కొందరికి గుంటల్లో పరిహారం వచ్చింది. రూ. లక్షల్లో పరిహారం రావాల్సి ఉండగా రూ. వేలల్లోనే వచ్చింది. తీవ్ర అన్యాయం జరిగిందని నిర్వాసితులు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ పద్మశ్రీని కలిసి గోడు వినిపిస్తున్నారు. తమ పంచాయతీ పరిధిలోని మూడు తండాల వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు వల్లూరు సర్పంచి శ్రీనివాసులు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రవినాయక్‌ పేర్కొన్నారు.


అధికారుల తీరుతో తీవ్ర అన్యాయం : రెవెన్యూ అధికారులు పరిహారం విషయంలో చేసిన తప్పులతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగింది. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మా తండావాసులకు అధికారులే బాధ్యత వహించి న్యాయం చేయాలి.

జలంధర్‌, రాగడిపట్టితండా


గజాల లెక్కన పరిహారం ఇవ్వాలి  : గిరిజన తండాల్లో ఇల్లు, వాకిళ్లను గుంటల్లో కాకుండా గజాల లెక్కన కొలిచి పరిహారం ఇవ్వాలి. లేదంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. కనీసం గజం రూ.4వేల చొప్పున అయినా పరిహారం ఇవ్వాలి. అధికారులు, ఎమ్మెల్యే న్యాయం చేయాలి.

గోపాల్‌, తుమ్మలకుంటతండా


ప్రభుత్వానికి నివేదిస్తాం : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కలెక్టర్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ గజానికి రూ.3వేల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించింది. అదేవిధంగా ప్రతిపాదనలు పంపాం. తండాల్లోని ఇళ్లు మాత్రమే లెక్కిస్తాం. ఎక్కువ విస్తీర్ణం ఉండటం వల్ల వాకిళ్లను లెక్కిస్తే ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.కోట్లల్లో పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇది సాధ్యం కాదు. సమస్యను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్తాం. వారు చర్చించి నిర్దేశించిన మేరకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపుతాం.

పద్మశ్రీ, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని