logo

ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ షురూ!

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ వెలువడటంతో ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

Updated : 26 Jan 2023 05:51 IST

నేడు సీనియారిటీ జాబితా ప్రకటించే అవకాశం

ఖాళీల వివరాలు క్రోడీకరిస్తున్న విద్యాశాఖ అధికారులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ వెలువడటంతో ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుండగా.. 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాలపట్టికను రూపొందించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు అంచనాలు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. పండిట్‌, పీఆర్‌టీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై సందిగ్ధత నెలకొంది.


విద్యాశాఖ కసరత్తు

ఉపాధ్యాయుల బదిలీలను జిల్లాలో 2018లో చేపట్టారు. ఇప్పుడు విభాగాల వారీగా జాబితాలను జిల్లా విద్యాశాఖ తాత్కాలికంగా సిద్ధం చేసింది. ఒకే పాఠశాలలో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వారితో పాటు పదవీ విరమణకు మూడేళ్లలోపు సీనియారిటీ ఉన్నవారి వివరాలను సేకరించింది. మొత్తం మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, లాంగ్‌ స్టాండింగ్‌లో ఉన్నవారు, ఖాళీల వివరాలను విద్యాశాఖ బదిలీల కోసం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 2015లో పదోన్నతులు కల్పించింది. దాదాపు ఏడేళ్ల అనంతరం తిరిగి ఈ ప్రక్రియ నిర్వహిస్తుండటంతో విభాగాల వారీగా సీనియారిటీ జాబితా రూపొందించే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 జాబితాను ఆర్జేడీకి పంపించనున్నారు. ఎస్జీటీలు, పండిట్లు, స్కూల్‌ అసిసెంట్ల పదోన్నతుల వివరాలను సిద్ధంచేస్తున్నారు. జాబితాలు పూర్తికాగానే వాటిపై అభ్యంతరాలను స్వీకరించి చేర్పులు, మార్పులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్‌ పద్ధతిలో జరిగే పీజీహెచ్‌ఎం గ్రేడ్‌-2 బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ఆధారంగా స్కూల్‌ అసిస్టెంట్లకు పీజీ హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. అనంతరం ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు, ఎస్టీజీల ఖాళీలు ఏర్పడనున్నాయి. బదిలీల్లో పండిట్లు, పీఈటీలకు అవకాశమున్నా పదోన్నతుల విషయంలో వారిలో సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే టీచర్‌ వెబ్‌సైట్‌(హెచ్‌ఆర్‌ఎంఎస్‌)లో పొందుపర్చిన వివరాల ఆధారంగా సీనియారిటీ జాబితాలను తయారు చేస్తున్నారు.
* బదిలీలు, పదోన్నతులకు సీనియారిటీ జాబితాల రూపకల్పనలో దీర్ఘకాలంగా ఒకే స్థానంలో ఉన్న ప్రధానోపాధ్యాయులతో పాటు పదోన్నతులకు అర్హుల వివరాలను సేకరించారు. ప్రధానోపాధ్యాయుల్లో బదిలీలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు కొంత దూరంలోని పాఠశాలలకు బదిలీ అయ్యే అవకాశముండటంతో ఎవరికి వారే లెక్కలు వేసుకోవడం ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. ఇన్‌ఛార్జులతో వాటిని నెట్టుకురావడంతో ఉపాధ్యాయులకు పనిభారంతో పాటు పర్యవేక్షణకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. బదిలీలు, పదోన్నతులతో ఈ సమస్య చాలా మేరకు తీరనుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో పాఠశాలల్లో 105, స్థానిక సంస్థల యాజమాన్యంలోని బడుల్లో 380 కలిపి 485 ఖాళీలను గుర్తించారు.

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు