logo

నల్లమలలో మార్గదర్శకులు

కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు, వింతలు తెలుసుకోవాలనే ఉత్సుకత పర్యాటకుల్లో ఉంటుంది. దీని కోసం పక్కనున్న వారినో, అంతర్జాలం సాయంతోనో అందుబాటులో ఉన్న కొంత సమాచారం తెలుసుకుంటాం.

Published : 27 Jan 2023 04:43 IST

పర్యాటకులకు ఏటీఆర్‌ విశేషాలు వివరిస్తూ చెంచు యువత ఉపాధి

నేచర్‌ గైడ్‌లు చెంచుపెంట యువత

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు, వింతలు తెలుసుకోవాలనే ఉత్సుకత పర్యాటకుల్లో ఉంటుంది. దీని కోసం పక్కనున్న వారినో, అంతర్జాలం సాయంతోనో అందుబాటులో ఉన్న కొంత సమాచారం తెలుసుకుంటాం. అయినా ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. అదే స్థానికంగా ఏళ్ల తరబడి నివసిస్తున్న వారు అందుబాటులో ఉంటే అన్ని విశేషాలను తెలుసుకునే వీలుంటుంది. దశాబ్దాల తరబడి అడవిలోనే ఉంటున్న తమ పూర్వీకుల నుంచి ఎన్నో అనుభవాలు, విశేషాలను తెలుసుకొని కొన్నేళ్ల నుంచి జీవనం సాగిస్తున్న చెంచు యువకులే అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతంలో (ఏటీఆర్‌) సఫారీ వాహనాలకు నేచర్‌గైడ్‌లుగా వ్యవహరిస్తూ ఉపాధి పొందుతున్నారు. సందర్శకులకు పక్షులు, జంతువులు, కీటకాల పేర్లతో పాటు వివిధ మొక్కలు, చెట్ల పేర్లు వాటి ఉపయోగాలు, అక్కడి వాతావరణం, స్థానిక తెగల జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులు అడవిలో ట్రెక్కింగ్‌ చేయడానికి సాయపడుతూ దారి చూపిస్తుంటారు. అటవీ సందర్శన సమయంలో వన్య మృగాల దాడి నుంచి రక్షణగా తోడుంటున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు, యువకులు, స్నేహితులు ఇలా ఎవరైనా ఏటీఆర్‌ను సందర్శించాలనుకునే వారికి అమ్రాబాద్‌, లింగాల, బల్మూరు మండలాల్లోని వెంకటేశ్వర్ల బావి, అప్పాపూర్‌, పెట్రాల్‌ చేన్‌, చెంచుగూడెం, బిల్లకల్‌, పదర చెంచుపెంటలకు చెందిన యువకులు సఫారీ వాహనాల్లో నేచర్‌ గైడ్‌లుగా వ్యవహరిస్తూ పర్యాటకులు పూర్తిస్థాయిలో ప్రకృతిని ఆస్వాదించేలా సాయపడుతున్నారు.


చెట్ల ఉపయోగాలు వివరిస్తాం..
- సి.ఆంజనేయులు, పదర

మాది అమ్రాబాద్‌ మండలం పదర. ఇంటర్‌ వరకు చదివాను. అటవీశాఖలో శిక్షణ తీసుకుని నేచర్‌గైడ్‌గా మారాను. ఇక్కడి అభయారణ్యానికి వచ్చే పర్యాటకులకు అడవిలోని వివిధ మొక్కలు, చెట్ల పేర్లు వాటి ఉపయోగాలు వివరిస్తాం. విద్యార్థుల్లో ఆసక్తి మెండు. వారికి వివిధ జంతువులు, పక్షులు, కీటకాల పేర్లు, ఇక్కడి వాతావరణం గురించి క్షుణ్నంగా చెబుతాం.


ట్రెక్కింగ్‌లో సాయంగా..
- ఎన్‌.గణేశ్‌, చెంచుగూడెం (బల్మూరు)

మాది బల్మూరు మండలం చెంచుగూడెం. పదో తరగతి పూర్తి చేసాను. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం సందర్శనకు వచ్చే వారికి గైడ్‌గా ట్రెక్కింగ్‌లో సాయం చేస్తా.. అడవిలో పర్యటించేటపుడు పర్యాటకులు పాటించాల్సిన నియమాలు వివరిస్తూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ట్రెక్కింగ్‌ విజయంతంగా పూర్తిచేసేలా బాధ్యత తీసుకుంటాం.


ప్రకృతిని ఆస్వాదించేలా..
- పరశురామ్‌, వెంకటేశ్వర్ల బావి గ్రామం (అమ్రాబాద్‌)

ఏటీఆర్‌లో సఫారీ వాహనాలకు నేచర్‌ గైడ్‌లుగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి చెంచుపెంటల యువకులకు అడవిలోని పరిస్థితులపై అవగాహన ఉంది. మా పూర్వీకుల నుంచి తెలుసుకున్న ఎన్నో విశేషాలను పర్యాటకులకు ఆసక్తిగా వివరిస్తున్నా. అటవీశాఖ అధికారుల ప్రత్యేక శిక్షణ ఆత్మవిశ్వాసం నింపింది. పర్యాటకులు ట్రెక్కింగ్‌ అనంతరం దృశ్య కేంద్రం వద్ద ప్రకృతిని పూర్తిస్థాయిలో ఆస్వాదించే వరకు అన్ని విధాల సాయపడతాం.


వారికే పూర్తి అవగాహన ఉంటుందని..
- శ్వేత, ప్రజా సంబంధాల అధికారిణి, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం

ఏటీఆర్‌లో గతంలో రెండు సఫారీ వాహలుండగా మరో అయిదు కొత్త వాటిని అందుబాటులోకి తెచ్చాం. ఇందులో గైడ్‌లుగా అడవిపై పూర్తి అవగాహన ఉండే స్థానిక చెంచు యువతకే అవకాశం కల్పించాం. పదో తరగతి అర్హతతో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి వీరికి వివిధ జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ఆంగ్ల పేర్లు కూడా నేర్పించాం. పర్యాటకులతో ఎలా మాట్లాడాలి, సందర్శకులు అడవిలో ఎలాంటి నియమాలు పాటించాలో కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. దీంతో వీళ్లు పర్యాటకులకి అన్ని విధాల సహకారం అందిస్తారు.  పర్యాటకులే వీరికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని