logo

తపాలా పథకాలపై విస్తృత ప్రచారం

తపాలా శాఖ అందిస్తున్న సంక్షేమ, పొదుపు పథకాల ప్రచారానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈనెల 28 నుంచి 31 వరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించనున్నారు.

Published : 27 Jan 2023 04:43 IST

నాగర్‌కర్నూల్‌ : తపాలాకార్యాలయం వద్ద పథకాలపై వివరిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, కొల్లాపూర్‌ గ్రామీణం: తపాలా శాఖ అందిస్తున్న సంక్షేమ, పొదుపు పథకాల ప్రచారానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈనెల 28 నుంచి 31 వరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించనున్నారు. తపాలా పొదుపు పథకాల వడ్డీరేట్లు పెరిగినట్లు వనపర్తి డివిజన్‌ ఇన్‌ఛార్జి, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా నాగర్‌కర్నూల్‌ సబ్‌డివిజన్‌ అధికారి విక్రమ్‌ ఆధ్వర్యంలో పొదుపు, బీమా పథకాలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సేవింగ్‌ ఖాతా..: గ్రామీణ ప్రజలు తమ రోజువారీ సంపాదన పొదుపు చేసుకునేందుకు ఈ ఖాతా ఉపయోగపడనుంది. బ్యాంకుల కంటే 4 శాతం అధికంగా వడ్డీ చెల్లించనున్నారు. ఉచిత ఏటీఎం సేవలు, చెక్‌బుక్‌, ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం ఉంది. ఉమ్మడి జిల్లాలో 2 లక్షలకు పైగా పొదుపు ఖాతాలున్నాయి. పాన్‌, ఆధార్‌కార్డుతోపాటు రెండు ఫొటోలు, రూ.500 సమీపంలోని పోస్టాపీసులో చెల్లిస్తే ఖాతా తెరిచి ఖాతాదారుకు పాసుపుస్తకం అందజేస్తారు.

సుకన్య సమృద్ధి ఖాతా..: ఆడపిల్లలకు ఆర్థిక చేయూతనందించే ఈ పథకంలో రూ.250 చెల్లించి ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్లలోపు ఆడపిల్లలకు ఈ పథకం వరం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ప్రస్తుతం 7.6 శాతం చక్రవడ్డీ కొనసాగుతోంది. ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల వరకు పొదుపు చేయవచ్చు. ఖాతా తెరిచిన నాటి నుంచి 21 ఏళ్ల తర్వాత సొమ్ము చెల్లిస్తారు. అమ్మాయి వయస్సు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం, చదువులకు అంతకుముందు సంవత్సరం వరకు జమ అయిన సొమ్ములో 50 శాతం సొమ్ము వెనక్కి తీసుకోవవచ్చు. సెక్షన్‌ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు ఉంది.

టైం డిపాజిట్‌.. : ఈ ఖాతాలో కనీసం రూ.వెయ్యి నుంచి ఎంతైనా జమ చేయవచ్చు. కాలపరిమితి 1, 2, 3, 5 ఏళ్లు. వడ్డీ ఏటా చెల్లిస్తారు. సంవత్సరానికి 6.6 శాతం, రెండేళ్లకు 6.8 శాతం, 3 ఏళ్లకు 6.9 శాతం, 5 ఏళ్లకు 7 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. పెద్దమొత్తంలో జమచేసేందుకు ఈ ఖాతా అనువుగా ఉంటుంది.

మంత్లీ ఇన్‌కం స్కీమ్‌.. : ఈ ఖాతా ద్వారా లబ్ధిదారుడు రూ.4.50 లక్షల వరకు, జాయింట్‌గా రూ.9 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఇందుకు నెలనెలా 7.1 శాతంతో వడ్డీ పొందే వీలుంది. ఖాతా కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది.

మెరుగైన పాలసీలు.. : ఇతర బీమా పథకాలకంటే మెరుగ్గా తపాలా జీవిత బీమా ఉంటుంది. ఇందులో కనీసం రూ.20 వేలు నుంచి రూ. 50 లక్షల వరకు బీమా పాలసీలు పొందవచ్చు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌ అందుతుంది. 19 నుంచి 55 ఏళ్లలోపు  వారు ఇందులో చేరవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఈ బీమాలో చేరవచ్చు. పాలసీ ప్రారంభించిన 3 ఏళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంది. పాలసీదారుడు ఆకస్మాత్తుగా మరణిస్తే పాలసీ సొమ్ము, బోనస్‌తో కల్పి నామినీకి చెల్లిస్తారు.

గ్రామీణ బీమా ఆకర్షణీయం.. : తపాలా జీవిత, గ్రామీణ బీమాకు ఆదరణ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారందరికీ బీమా వర్తిస్తుంది. ఇందులో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు విలువగల పాలసీలు పొందవచ్చు. నిరక్షరాస్యులు 19 నుంచి 45 ఏళ్లలోపు వారు, అక్షరాస్యులు 55 ఏళ్ల వరకు బీమా పథకాలు పొందవచ్చు. పాలసీలో చేరిననాటి నుంచి 3 ఏళ్ల తర్వాత రుణం, ఆకస్మాత్తుగా మరణిస్తే పాలసీ విలువ బోనస్‌తోకలిపి నామినీకి చెల్లిస్తారు. దేశంలో ఎక్కడైనా ప్రీమియం చెల్లింపు చేసుకోవచ్చు. అంతర్జాలంలో కూడా చెల్లించే అవకాశం ఉంది.

వెంకటేశ్వర్లు, వనపర్తి తపాలా డివిజన్‌ పర్యవేక్షకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని