logo

సమష్టి కృషి, సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి

అన్ని శాఖల అధికారుల సమష్టి కృషి, సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తేనే జిల్లా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

Published : 27 Jan 2023 04:43 IST

కందనూలు, న్యూస్‌టుడే : అన్ని శాఖల అధికారుల సమష్టి కృషి, సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తేనే జిల్లా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శాంతకుమారి, ఎస్పీ మనోహర్‌ అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా జిల్లాలోని చారకొండ మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందించామన్నారు. మిగిలిన నియోజకవర్గాల పరిధిలోనూ 301 లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 1708 మంది లబ్ధిదారులకు రూ. 169.09 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో జిల్లాలో 49,336 ఖాతాలు పెండింగ్‌లో ఉండగా రెవెన్యూ అధికారులు 41,432 ఖాతాల సమస్యలు పరిష్కరించి డీజిటల్‌ సంతకం చేసినట్లు తెలిపారు. రైతు బంధు పథకంలో 2 లక్షల 88 వేల మంది రైతులకు రూ. 3.195 కోట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. బిజినేపల్లి మండలంలో మార్కండేయ లిఫ్ట్‌ పనులకు రూ. 76.95 కోట్లు కేటాయించామని 7,310 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ప్రస్తుతం భూసేకరణ దశలో ఉందన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 35,600 విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు మెరుగయ్యాయన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నాలుగేళ్లుగా 197.40 టీఎంసీల నీళ్లు ఆయకట్టుకు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఏడాదిలో 22.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు సూచించారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ. 10 కోట్లతో ఉమామహేశ్వరం దేవస్థానం వద్ద అతిథి గృహాలు, రెస్టారెంట్లు నిర్మిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుశాఖ పకడ్బందీగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర పోలీసుశాఖ 14 వర్టికల్స్‌ అమలు చేయగా 5 వర్టికల్స్‌ విభాగంలో జిల్లా పోలీసు సిబ్బంది ముందున్నారని వివరించారు. 150 కంటే తక్కువ కేసులు నమోదైన జిల్లాలోని ఉప్పునుంతల ఠాణా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, అమ్రాబాద్‌ 5వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజలు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపాడాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ హనుమంతురావు, పురపాలక శాఖ ఛైర్‌పర్సన్‌ కల్పన తదితరులు పాల్గొన్నారు.

జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఎస్పీ మనోహర్‌.. జిల్లా ప్రగతిని వివరిస్తున్న కలెక్టర్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని