logo

త్యాగధనుల కృషి చిరస్మరణీయం

ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా నేడు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుగుకుంటున్నామని, వారి కృషి చిరస్మరణీయమని కలెక్టర్‌ క్రాంతి అన్నారు.

Updated : 27 Jan 2023 06:42 IST

కనిపించని సందడి

జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ క్రాంతి, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ చిత్రంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా నేడు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుగుకుంటున్నామని, వారి కృషి చిరస్మరణీయమని కలెక్టర్‌ క్రాంతి అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి 9.45 నిమిషాల వరకు నిర్వహించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకం ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలభవన్‌తోపాటు మరో రెండు పాఠశాలలకు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం రెవెన్యూ, పోలీసుశాఖ మధ్య క్రికెట్‌ పోటీ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, డా. అబ్రహం, ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌లు హాజరయ్యారు.

సంబరంగా నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవాన్ని రెవెన్యూశాఖ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా మమ అనిపించడంపై జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించగా గతేడాది కొవిడ్‌ కారణంగా నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఈ ఏడాది ఎలాంటి పరిమితులు లేనప్పటికి పరేడ్‌ గ్రౌండ్‌లో ఏ మాత్రం సందడి కనిపించలేదు. పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాలో వివిధ శాఖల్లో పని తీరు కనబరిచిన ఉద్యోగులు, జిల్లా అధికారులు, పోలీసులు, కొంత మంది విద్యార్థులు తప్ప రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులెవరూ హాజరకాలేదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను పట్టించుకోలేదని ఆయా పాఠశాలల కరస్పాండెంట్‌లు రెవెన్యూ అధికారులతో వాదనకు దిగారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. పట్టణంలోని ఓ పాఠశాల నుంచి ప్రదర్శన నిమిత్తం వచ్చిన 30 విద్యార్థుల ప్రదర్శన పూర్తి కాకుండానే మధ్యలోనే నిలిపివేడంతో నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని