logo

కనులపండువగా అమ్మవారి నిజరూప దర్శనం

అయిదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ సన్నిధిలో మాఘమాసం వసంత పంచమి పురస్కరించుకుని గురువారం భక్తులకు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన  భాగ్యం కలిగించారు.

Published : 27 Jan 2023 04:43 IST

పంచామృతాభిషేకం చేస్తున్న దృశ్యం

అలంపూర్‌, న్యూస్‌టుడే : అయిదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ సన్నిధిలో మాఘమాసం వసంత పంచమి పురస్కరించుకుని గురువారం భక్తులకు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన  భాగ్యం కలిగించారు. జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జోగులాంబ జాతర పేరిట పట్టణంలో వివిధ వేషాధారణలు, వాయిద్యాల మధ్య భక్తజనం భారీగా కలశాలతో ఆలయాలకు తరలి వచ్చారు. వీటిని జోగులాంబ అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి చీరలు, ఒడి బియ్యం, నిమ్మకాయలమాల సమర్పించారు. అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ ఆలయంలోని కుంకుమార్చన మండపంలో సహస్ర కలశాభిషేకాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యగశాలలో అవాహిత దేవతమూర్తులకు ఉదయం 9 గంటలలోపు పూర్ణాహుతి చేశారు. వేల సంఖ్యలో భక్తుల రాకతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్య మధ్యలో ప్రముఖుల తాకిడి ఉండటంతో భక్తులు కొంత మేరకు ఇబ్బంది పడ్డారు. కలశాలను అమ్మవారికి సమర్పించేందుకు దాదాపు గంటకుపైగా క్యూలైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసి సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత మళ్లీ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.

కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

వేడుకగా ఆదిదంపతుల కల్యాణం : వసంత పంచమిని పురస్కరించుకుని గురువారం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని జోగులాంబ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాలకు శాంతి కల్యాణోత్సవం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని