logo

అద్భుతంగా మన్యంకొండ సుందరీకరణ : మంత్రి

అభివృద్ధి పనులతో మన్యంకొండను అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో మన్యంకొండ వద్ద చేపట్టిన అభివృద్ది పనులను కలెక్టర్‌ వెంకట్‌రావుతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు.

Published : 27 Jan 2023 04:43 IST

మన్యంకొండ వద్ద సెంట్రల్‌ లైటింగ్‌ పనులను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : అభివృద్ధి పనులతో మన్యంకొండను అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో మన్యంకొండ వద్ద చేపట్టిన అభివృద్ది పనులను కలెక్టర్‌ వెంకట్‌రావుతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. రూ.52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న సెంట్రల్‌ లైటింగ్‌ విద్యుత్తు దీపాల పనులను ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. డివైడర్ల మధ్య ఎత్తైన పూల మొక్కలు నాటి మధ్యలో గడ్డిని పెంచాలని సూచించారు. అనంతరం తేరు, కోనేరు మైదానం వద్ద నిర్మించిన వసతిగృహాలను పరిశీలించారు. వసతిగృహాల్లో కొన్నింటిని వీఐపీలకు, స్వామి సన్నిధిలో పనిచేసే సేవాదళ్‌కు కేటాయించాలని సూచించారు. మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఏటా భక్తుల తాకిడి పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా అన్నదాన సత్రాన్ని, భక్తులు బసచేసే షెడ్లు, కల్యాణ మండపాన్ని విస్తరించాలన్నారు. ఇందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన్యంకొండ అలివేలు మంగ అమ్మవారి సన్నిధిలో పెళ్లిళ్లు చేసుకునే పేదలకు మన్యంకొండ ఆలయం తరఫున ఉచితంగా పుస్తె మెట్టెలు అందించి భోజన సదుపాయాలు కల్పించాలని దేవస్థానం ఛైర్మన్‌ను కోరారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, దేవస్థానం ఛైర్మన్‌ అలహరి మధుసూదన్‌కుమార్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ ఇంజనీయర్లు పాల్గొన్నారు

అబ్దుల్‌ ఖాదర్‌ దర్గాలో చాదర్‌ సమర్పణ..

హజ్రత్‌ అబ్దుల్‌ ఖాదర్‌ (ర.అ) దర్గా ఉర్సు వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ దర్గాను సందర్శించారు. పూల చాదర్‌, గెలాఫ్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ముతవల్లి జమీర్‌ ఖాద్రి, వక్ఫ్‌ సంరక్షణ కమిటీ సభ్యుడు అన్వర్‌పాషా, భారాస నాయకులు సయ్యద్‌ సుల్తాన్‌, జావెద్‌ బేగ్‌ పాల్గొన్నారు.

విజేతలకు బహుమతి ప్రదానం

మహబూబ్‌నగర్‌ క్రీడలు : తెలంగాణ అమరవీరుల స్మారక వాలీబాల్‌ ఉమ్మడి జిల్లా టోర్నీలో షాద్‌నగర్‌ జట్టు విజయం సాధించి స్వర్ణ పతకం అందుకుంది. రన్నర్స్‌గా రామయ్యబౌలి (మహబూబ్‌నగర్‌), మూడో స్థానంలో ఆవంచ జట్లు నిలిచాయి. విజేతలకు గురువారం రాత్రి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ బహుమతులు ప్రదానం చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలో జిల్లా కేంద్రానికి వాలీబాల్‌ అకాడమీ, స్టేడియంలో అధునాతన మల్టీపర్పస్‌ ఇండోర్‌ మైదానం అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో భారాస నాయకులు, నిర్వాహకుడు మతీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని