logo

పాలమూరు ఆర్థికంగా పుంజుకోవాలి

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో పాలమూరు జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది.

Published : 27 Jan 2023 04:46 IST

మహబూబ్‌నగర్‌ మినహా మిగతా జిల్లాలు చివరి స్థానంలో
రాష్ట్ర గణాంకాల నివేదికలో వెల్లడి

పోలేపల్లిలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో పాలమూరు జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. మహబూబ్‌నగర్‌ రాష్ట్రంలో 10వ స్థానంలో ఉండగా నాగర్‌కర్నూల్‌ 19వ స్థానానికి పరిమితమైంది. 2020-21 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించడం లేదు. తలసరి ఆదాయంలో మాత్రం మహబూబ్‌నగర్‌ రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా నాలుగు జిల్లాలు తలసరి ఆదాయంలో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక- అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో సగటున ఒక్కొక్కరు సంవత్సరానికి రూ.1.61 లక్షలు సంపాదిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వృద్ధిరేటు సగటున రూ.13,688 కోట్లు. 2020-21లో ప్రస్తుత ధరల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో ఉత్పతి అయిన సరుకులు, సేవల మొత్తం విలువతో జీడీడీపీని గణిస్తారు.

సంక్షేమ పథకాలు దోహదం

పాలమూరు జిల్లాల జీడీడీపీ వృద్ధి చెందడానికి సాగునీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దోహదం చేస్తున్నాయి. ఏటా ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరందిస్తుండటంతో సాగు పెరిగింది. వరి, పత్తి, కందులు, వేరుశనగ పంటల ద్వారా రైతుల ఆదాయం పెరుగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రైతుబంధు, ఆసరా ఫించన్లు, గొర్రెల పంపిణీ, సబ్సిడీ, తక్కువ వడ్డీతో రుణాలు అందించడంతో ప్రజల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతోంది. అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం, గ్రామ స్థాయికి వైద్య సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. చాలా మంది హైస్కూల్‌, ఇంటర్‌ విద్యకే పరిమితమవుతున్నారు. వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు వీటిలో మరింత పురోగతి సాధించాలి.

మొదటి 10 స్థానాల్లో..

తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ మొదటి 10 స్థానాల్లో నిలిచింది. ఈ జిల్లా హైదరాబాద్‌కు దగ్గర ఉండటంతో మహబూబూబ్‌నగర్‌, జడ్చర్ల పురపాలికలు ప్రధాన పట్టణాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇతర జిల్లాల్లో పని చేసే ఉద్యోగులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్టుగడ్డ పారిశ్రామికవాడ, పోలేపల్లిలో ప్రముఖ ఫార్మ పరిశ్రమలతో గ్రీన్‌ పారిశ్రామికవాడలున్నాయి. బాలానగర్‌, రాజాపూర్‌ మండలాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో  పని చేయడానికి వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు పెరగడంతో జిల్లాలో తలసరి ఆదాయం పెరుగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాతో పోలిస్తే మిగతా పాలమూరు జిల్లాల్లో పరిశ్రమలు లేవు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పాలకులు చర్యలు తీసుకోకపోవడంతో ఆ నాలుగు జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటంలేదు. గత ఎనిమిదేళ్లుగా ఈ జిల్లాలు పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా ఉన్నాయి. నిరక్షరాస్యత కూడా అధికంగానే ఉంది. కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారే అధికం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వలసలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని