logo

కనులపండువగా తిరుచ్చిసేవ

మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టమైన తిరుచ్చిసేవ మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌ మండలం కోటకదిర గ్రామంలోని వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్‌ నివాసం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తిని భక్తులు పల్లకిలో ఊరేగిస్తూ మన్యంకొండపై ఆలయానికి చేర్చారు.

Published : 01 Feb 2023 04:48 IST

కోటకదిర నుంచి మన్యంకొండకు చేరుకున్న వేంకటేశ్వరస్వామి

వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టమైన తిరుచ్చిసేవ మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌ మండలం కోటకదిర గ్రామంలోని వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్‌ నివాసం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తిని భక్తులు పల్లకిలో ఊరేగిస్తూ మన్యంకొండపై ఆలయానికి చేర్చారు. పల్లకీలో ఊరేగుతున్న మన్యంకొండరాయుడికి గ్రామాల్లో జనం హారతులు పట్టారు. పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి పల్లకీ ముందు ఓబులాయపల్లి, కోటకదిర గ్రామాల భజన బృందాల ఆటపాటలు, మహిళల కోలాటం అలరించాయి. కోటకదిరలో రాత్రి 9 గంటలకు మొదలైన తిరుచ్చిసేవ 11 గంటలకు ఘాట్‌రోడ్ల వెంట మన్యంకొండ తేరుబజారుకు చేరుకుంది. అనంతరం మెట్లదారి గుండా గోవింద నామస్మరణల మధ్య గర్భాలయానికి స్వామివారిని చేర్చారు. వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ ఛైర్మన్‌ అలహరి మధుసూదన్‌కుమార్‌, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు, పర్యవేక్షణాధికారి నిత్యానందచారి, సర్పంచి రమ్య, అర్చకులు, పాలక మండలి సభ్యులు  పాల్గొన్నారు.

ధర్మకర్త మధుసూదన్‌కుమార్‌ నివాసం నుంచి బయలుదేరిన పల్లకీ

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం : మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాటు చేసిన భద్రతను ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఆలయ ప్రాంగణానికి వెళ్లి పర్యవేక్షించారు. భద్రత చర్యలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్‌ కోసం ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. కోనేరు, గర్భగుడి, కొండపైకి ఎక్కడానికి రహదారి, వచ్చే అతిథులకు ఏర్పాట్లపై చర్చించారు. రాత్రి పూట భక్తులు నిద్రించే ప్రాంతాలు, స్నానాలు చేసే ప్రదేశాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, కమాండ్‌ కంట్రోల్‌ గది, అత్యవసర వాహనాలను నిలుపు చేసే స్థలం తదితర వాటిని పరిశీలించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్‌, ఆదినారాయణ, సీఐలు రామకృష్ణ, రాజు, రాజేశ్వర్‌గౌడ్‌, ఎసై వెంకటేశ్వర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని