logo

ఆర్టీసీ దవాఖానాలో సిబ్బంది కొరత

నిత్యం వేలాదిమందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉండాలి. అందుకనే ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేకంగా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది.

Published : 01 Feb 2023 04:48 IST

వేలాది మంది ఉద్యోగులకు ఒకే వైద్యుడు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం

మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ ఆస్పత్రి

నిత్యం వేలాదిమందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉండాలి. అందుకనే ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేకంగా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ సిబ్బంది అందరికీ ఇదొక్కటే ఆసుపత్రి. వేలాది మందికి కేవలం ఒక్కరే వైద్యులు ఉన్నారు. అవసరమైన మాత్రలు అందుబాటులో లేవు. గతంలో అసలు వైద్యులే లేకపోవడంతో దాదాపు మూడు, నాలుగు నెలల పాటు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఒప్పంద పద్ధతిలో ఒకరిని నియమించారు. వివిధ రోగాలకు సంబంధించి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు ఏళ్లుగా ఖాళీగా ఉంది. నిత్యం పదుల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పరీక్షలకు వచ్చి వెనుదిరుగుతున్నారు. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌లోని పది డిపోల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు ఆర్టీసీ ఆర్‌ఎం అధికారులు, సిబ్బంది మొత్తం కలిపి 3,601 మంది ఉన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు వారి సతీమణులు సుమారు 2వేల మంది వరకు మొత్తం 5,600కు పైగా మంది ఉన్నారు. ఆర్టీసీ ఆస్పత్రిలో సిబ్బంది కొరతతో నిత్యం వచ్చే రోగులు సతమతమవుతున్నారు. వీరికి ప్రస్తుతం ఒకేఒక వైద్యుడు ఉండటం గమనార్హం.

రక్తపోటు, మధుమేహం బాధితులే ఎక్కువ..: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. డ్రైవింగ్‌ సీట్లో ఎక్కువ సమయం కూర్చోవడం మూలంగా 50 శాతం మందికి రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఆసుపత్రికి రోజుకు కనీసం 50 నుంచి 60 మంది అనారోగ్యంతో వచ్చి వెళ్తున్నారు. తీవ్రమైన అనారోగ్యం చేసినప్పుడు ఉద్యోగులు విధులకు సెలవు పెడుతుంటారు. సెలవు మంజూరు కావాలంటే వైద్యుడు పరీక్షించి వ్యాధి తీవ్రత ధ్రువీకరించాలి. కేవలం ఒకే వైద్యుడు ఉండటంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు నేరుగా తార్నాక ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.


రక్తపరీక్షలు లేక ఇబ్బందులు..

హబూబ్‌నగర్‌ ఆర్టీసీ ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న ఫార్మాసిస్టు పోస్టులో ఇటీవల ఒకరిని నియామకం చేశారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. నిత్యం వచ్చే పదుల సంఖ్యలో రోగులు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నా..ల్యాబ్‌టెక్నీషియన్‌ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వందలాది రూపాయలు వెచ్చించి బయట చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆయా లేరు. రికార్డులు చూసేందుకు సిబ్బంది లేరు. చాలా వరకు ఔషధాలు కూడా అందుబాటులో ఉండటం లేదని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మరో వైద్యుడితో పాటు, అవసరమైన సిబ్బందిని నియమించి, ఔషధాలు అన్నీ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని