logo

కలెక్టర్‌గా రవి నాయక్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.రవినాయక్‌ నియమితులయ్యారు. జగిత్యాల కలెక్టర్‌గా ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నారు.

Published : 01 Feb 2023 04:48 IST

వనపర్తికి తేజస్‌ నంద్లాల్‌
ఇద్దరి విద్యాభ్యాసం సైనిక్‌ పాఠశాలల్లోనే..
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

హబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.రవినాయక్‌ నియమితులయ్యారు. జగిత్యాల కలెక్టర్‌గా ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నారు. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావ్‌ సూర్యాపేట జిల్లాకు బదిలీ అయ్యారు. మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న తేజస్‌ నంద్లాల్‌ పవర్‌ వనపర్తి కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా కుమురం భీం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మహబూబ్‌నగర్‌  కలెక్టర్‌గా రానున్న రవినాయక్‌ 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఆయన విజయనగరంలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. వరంగల్‌లోని ఆర్‌ఈసీలో బీటెక్‌ పూర్తి చేశారు. తర్వాత గ్రూపు-1 అధికారిగా బాధ్యతలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌ జిల్లాల సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2015లో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ అయ్యారు. ప్రస్తుతం జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై వస్తున్నారు.

వనపర్తి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తేజస్‌ నంద్లాల్‌ పవర్‌ 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. కామారెడ్డి జిల్లాలో ఏడాది శిక్షణ నిమిత్తం విధులు నిర్వహించారు. అనంతరం 2020లో మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌గా(స్థానిక సంస్థల) మొదటిసారిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ఆయనకు వనపర్తి జిల్లాకు పదోన్నతిపై కలెక్టర్‌గా పంపించారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా. అక్కడే సైనిక్‌ పాఠశాలలో విద్యాభాస్యం పూర్తి చేశారు. నాసిక్‌లోని సందీప్‌ ఫౌండేషన్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సివిల్స్‌ రాసి ఐఏఎస్‌కు ఎంపియ్యారు.


యాస్మిన్‌ బాషా మూడేళ్ల సేవలు..

కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాకు రెండో కలెక్టర్‌గా షేక్‌ యాస్మిన్‌ బాషా బాధ్యతలు చేపట్టారు. సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా ఉన్న ఆమె 2020 ఫిబ్రవరిలో వనపర్తి కలెక్టర్‌గా వచ్చారు. 2003లో గ్రూపు-1 పరీక్ష రాశారు. 2007లో ఫలితాలు రాగా ఆమెను శిక్షణ కోసం మెదక్‌ జిల్లాలోని హత్నూరా ఎంపీడీవో కార్యాలయానికి పంపించారు. అక్కడ ఏడాది పని చేసిన తర్వాత  డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్‌ శిక్షణ కూడా మెదక్‌ జిల్లాలోనే జరిగింది. 2011లో ఫారెస్టు సెటిల్‌మెంట్‌ అధికారిగా పూర్వ మహబూబ్‌నగర్‌కు వచ్చారు. అనంతరం ఇదే జిల్లాలో డీపీవోగా, జడ్పీ డిప్యూటీ సీఈవోగా, మీ సేవా సమన్వయకర్తగా, డీఆర్వోగా విధులు నిర్వహించారు. 2015 కన్ఫర్డ్‌ ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు.


సూర్యాపేటకు వెంకట్రావు బదిలీ.. : సూర్యాపేటకు బదిలీపై వెళ్లనున్న వెంకట్రావు ఫిబ్రవరి 2020లో మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా వచ్చారు. అంతకు ముందుకు నారాయణపేట కలెక్టర్‌గా ఉన్నారు. 2018లో మహబూబ్‌నగర్‌కు సంయుక్త కలెక్టర్‌గా వచ్చిన ఆయన ఇక్కడే ఐఏఎస్‌గా  పదోన్నతి పొందారు. అంతకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు బాధ్యతలు చేపట్టారు. అదనపు సంయుక్త కలెక్టర్‌గా, యాదాద్రి డీఆర్‌డీవోగా విధులు నిర్వహించారు. జిల్లాల పునర్విభజన ఆయన తర్వాత నారాయణపేట జిల్లాకు మొదటి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు రొనాల్డ్‌రోస్‌ తర్వాత రెండో కలెక్టర్‌గా వెంకట్రావు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని