logo

బడి స్థలాల పరిరక్షణపై సర్కారు దృష్టి

భూములకు మార్కెట్‌లో భారీగా డిమాండు పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో గజం ధర కనీసం 5 నుంచి 25 వేల రూపాయల దాకా పలుకుతోంది.

Published : 01 Feb 2023 04:48 IST

ఆక్రమణలకు గురికాకుండా వివరాలు సేకరిస్తున్న వైనం
అచ్చంపేట, న్యూస్‌టుడే

అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలం

భూములకు మార్కెట్‌లో భారీగా డిమాండు పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో గజం ధర కనీసం 5 నుంచి 25 వేల రూపాయల దాకా పలుకుతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు కొందరు అక్రమార్కులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం పాఠశాలలకు దాతలు భూములను ఉచితంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం వాటిల్లో భవనాలు నిర్మించి, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే అవకాశం కల్పించింది. పాఠశాలల ఆవరణల్లో కానీ, వాటికి అనుబంధంగా కానీ క్రీడా మైదానాలు, ఖాళీ స్థలాలున్నాయి. కొన్నిచోట్ల వాటిని సొంతం చేసుకోవాలని కొందరు యత్నిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తుండడంతో ప్రభుత్వం పాఠశాల ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించింది. విద్యాలయాలకు భూదానం చేసిన వారి వారసులు కూడా ఆయా ఖాళీ స్థలాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్కూళ్ల స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు పక్కాగా వివరాలు సేకరించే కార్యక్రమాన్ని సర్కారు చేపట్టింది. పాఠశాలల వారీగా మొత్తం భూవిస్తీర్ణం, తరగతి గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టిన స్థల విస్తీర్ణంతో పాటు మిగులు భూమి వివరాలను కూడా చదరపు అడుగుల్లో సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే డీఈవోలు ఆయా వివరాలు సేకరించాలని ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు సూచనలు చేశారు. స్కూళ్ల వారీగా ఖాళీగా ఉన్న స్థలాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు.

పూర్తికావస్తున్న ప్రక్రియ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ స్థలాల వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు విద్యాశాఖకు చేరిన ఆయా బడుల స్థలాలకు సంబంధించిన వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని 14 మండలాల్లో వంద శాతం నమోదు ప్రక్రియ పూర్తయింది. ఎంఈవోల పర్యవేక్షణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, డీఈవోల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని అమ్రాబాద్‌, బల్మూరు, బిజినేపల్లి, చారకొండ, కల్వకుర్తి, కోడేరు, కొల్లాపూరు, పదర, పెంట్లవెల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట, ఉప్పునుంతల, ఊర్కొండ, వంగూరు మండలాలు ఇప్పటికే వంద శాతం పాఠశాలల్లో ఖాళీ స్థలాల వివరాలను సేకరించి అధికారులకు పంపారు.

అచ్చంపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 90 వేల చదరపు అడుగుల స్థలం ఉండగా ఇప్పటివరకు 8,700 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టగా, ఇంకా 81,300 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది.

మండలంలోని గుంపన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 44,740 అదరపు అడుగుల స్థలం, చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 43,056, నడింపల్లి ప్రాథమిక బడిలో 30,756, అచ్చంపేట మండల పరిషత్తు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో 28,710, పీర్లబాయితండా ప్రాథమిక బడిలో 12,662, బ్రాహ్మణపల్లి బడిలో 12,109 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. చాలా పాఠశాలల్లో అధిక మొత్తంలో ఖాళీ స్థలాలు ఉండడంతో వాటి పరిరక్షణపై అధికారులు దృష్టి పెట్టి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.

అట్టడుగున పెద్దకొత్తపల్లి : ఖాళీ స్థలాల వివరాలను సేకరించడంలో పెద్దకొత్తపల్లి మండలం అట్టడుగున ఉంది. మండలంలో 50 పాఠశాలలుండగా 21 బడుల వివరాల సేకరణ పూర్తికాగా, మరో 29 మండలాలు పెండింగులో ఉన్నాయి. ఇప్పటివరకు 42 శాతం మాత్రమే భూముల వివరాల సేకరణ పూర్తయింది. ఆ తరువాత అచ్చంపేట మండలంలో 62.9, వెల్దండ 98.25, నాగర్‌కర్నూలు 91.53, లింగాల 96.3, తాడూరు మండలంలో 97.3 శాతం స్థలాల సేకరణ పూర్తి చేశారు.


సత్వరమే పూర్తికి చర్యలు

గోవిందరాజులు, డీఈవో, నాగర్‌కర్నూల్‌

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల స్థలాల వివరాలను సేకరించే ప్రక్రియను వెంటనే పూర్తిచేసేందుకు ఎంఈవోలు, హెచ్‌ఎంలు శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటివరకు 92.73 శాతం వివరాల సేకరణ పూర్తయింది. ఇంకా కేవలం 7.27 శాతమే సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 మండలాల ఎంఈవోలు, హెచ్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వంద శాతం పాఠశాలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. మిగిలిన బడుల హెచ్‌ఎంలు వెంటనే వివరాలు పంపేలా శ్రద్ధ తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని