logo

చిన్నారుల నాట్యం భళా

పిల్లలను చదువుల యంత్రాలుగా చూసే కాలమిది. రోజూ బండెడు పుస్తకాలు మోస్తూ తెల్లవారుజామునే ప్రత్యేక తరగతులు అని పిల్లలపై భరించలేని ఒత్తిడి మోపే ఈ కాలంలో మక్తల్‌ పట్టణానికి చెందిన సాయిసప్తశ్రీ, దీక్ష, వేదశ్రీ చదువుతోపాటు గత మూడేళ్ల నుంచి భరత నాట్యంలో రాణిస్తూ వారి ప్రతిభను చాటుకుం టున్నారు.

Updated : 01 Feb 2023 19:11 IST

న్యూస్‌టుడే, మక్తల్‌ పట్టణం

పిల్లలను చదువుల యంత్రాలుగా చూసే కాలమిది. రోజూ బండెడు పుస్తకాలు మోస్తూ తెల్లవారుజామునే ప్రత్యేక తరగతులు అని పిల్లలపై భరించలేని ఒత్తిడి మోపే ఈ కాలంలో మక్తల్‌ పట్టణానికి చెందిన సాయిసప్తశ్రీ, దీక్ష, వేదశ్రీ చదువుతోపాటు గత మూడేళ్ల నుంచి భరత నాట్యంలో రాణిస్తూ వారి ప్రతిభను చాటుకుంటున్నారు. వారి అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కూడా ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా వారు రాష్ట్ర స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు, రివార్డులు సాధించారు.


నృత్య ప్రదర్శన ఇస్తున్న వేదశ్రీ

ట్టణానికి చెందిన సుధీర్‌గౌడ్‌, జ్యోతి దంపతుల కుమార్తె వేదశ్రీ పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ప్రాణం. ఆమె అభిరుచులను గమనించిన వారి తల్లిదండ్రులు భరత నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఫలితంగా భరత నాట్యంపై పట్టు సాధించి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. శివరాత్రి రోజు శ్రీశైలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఇచ్చిన ప్రదర్శనకు ప్రశంసాపత్రం పొందింది. చిన్నజీయర్‌స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి తన ప్రతిభను చాటుకుంది.


హారతి జోషి సమక్షంలో అవార్డు అందుకుంటున్న దీక్ష

పట్టణానికి చెందిన అనిల్‌గౌడ్‌, లహరీల రెండో కుమార్తె దీక్ష 7వ తరగతి చదువుతూనే భరతనాట్యంలో ప్రతిభ కనబర్చుతోంది. ఈమె తన నాల్గవ ఏటనే తొలి ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు పొందింది. ఇప్పటికే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని 50 వరకు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపింది. 2022లో ఉగాది నంది పురస్కారం కూడా ఈమెను వరించింది.


జ్ఞాపిక అందుకుంటున్న సాయిసప్తశ్రీ

ట్టణానికి చెందిన రంజిత్‌రెడ్డి, మానసల ఏకైక కుమార్తె సాయిసప్తశ్రీ 2వ తరగతి చదువుతూనే భరతనాట్యంలో ప్రావీణ్యం సాధించింది. అబ్దుల్‌కలాం జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రత్యేక ప్రశంసాపత్రం పొందింది. 2021లో బాలల నృత్య విభాగంలో రవీంద్రభారతీలో నంది అవార్డు పొంది ప్రశంసలు అందుకుంది. అలాగే 2022లో ఉగాది పురస్కారంలో కూడా నంది అవార్డు అందుకొని తన ప్రతిభను చాటుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని