logo

వితంతువులకు భరోసా

ఆసరా పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబంలో భర్త మరణిస్తే.. వితంతు పింఛను పొందాలంటే భార్య మళ్లీ దరఖాస్తు చేయాలి.

Published : 02 Feb 2023 04:41 IST

లబ్ధిదారుల గుర్తింపులో అధికారులు
న్యూస్‌టుడే గద్వాల న్యూటౌన్‌

రాజోలి : ఎంపీడీవో కార్యాలయంలో వితంతువుల

వివరాలు నమోదు చేస్తున్న ఎంపీడీవో గోవింద్‌రావ్‌

ఆసరా పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబంలో భర్త మరణిస్తే.. వితంతు పింఛను పొందాలంటే భార్య మళ్లీ దరఖాస్తు చేయాలి. కార్యదర్శులు, ఎంపీడీవో పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిస్తే ఆరు నెలలకు, ఏడాదికో ఆమెకు ఆసరా మంజూరు చేసేవారు. దీంతో వితంతువులు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేవారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పింఛను వచ్చే భర్త మరణిస్తే.. నెలలోగా భార్యకు వితంతు పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వీరిని కార్యదర్శులు గుర్తిస్తుండగా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. ఇకపై మరణించిన 15 రోజుల్లో వివరాలు నమోదు చేసి పింఛను వచ్చేలా చేయనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

జిల్లాలో 12 మండలాలు, నాలుగు పురపాలికల పరిధిలో ఇప్పటికే మొత్తం 60,189 మంది పింఛనుదారులున్నారు. ఎన్నికల హామీలో భాగంగా గడిచిన ఆగస్టులో 57 ఏళ్లలోపు వారికి పింఛన్లు మంజూరు చేయడంతో అదనంగా మరో 16,123 మంది జాబితాలో చేరారు. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పింఛను అందుతోంది. అయితే భర్త మరణించిన వారికి పింఛను అందడం లేదనే విమర్శలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అవగాహన లేక మరణించినా వారి పేరుపై పింఛను ఖాతాలో జమవుతోంది. ఇది పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి. మరికొందరు పింఛనుకు బాధిత మహిళలు కనీసం దరఖాస్తు చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మరణించిన భర్త పింఛను భార్యకు బదలాయించడం ద్వారా వారి కుటుంబాలకు మేలు జరగనుంది. ఇప్పటికే అర్హులైన వారు జిల్లాలో సుమారు 250 మందికిపైగా ఉండొచ్చని అంచనా. వీరి జాబితాను ఎంపీడీవోలు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు నివేదిస్తే అతి త్వరలో పింఛను వారి ఖాతాల్లో జమ కానుంది.
ప్రతి నెలా ఎంపీడీవో కార్యాలయంలోనే.. : మూడేళ్లుగా ప్రభుత్వం ఆసరా దరఖాస్తులను పక్కన పెట్టగా చాలా మంది వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై భర్త మృతి చెందిన వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతోపాటుగా, భార్య వివరాలతో ఎంపీడీవో కార్యాలయంలో ఆసరా దరఖాస్తులను అందించనున్నారు. ఆయా గ్రామాల కార్యదర్శులు బాధితులను నెలవారీగా గుర్తించి లబ్ధి చేకూరేలా సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు