logo

ఏడేళ్లుగా పనిచేయని ఎత్తిపోతలు

మక్తల్‌ మండలంలోని మూడు ఎత్తిపోతల పథకాలు ఏడేళ్లుగా మూతపడ్డాయి. నీటి వనరులు ఉన్నా వర్షాధార పంటలు సాగు చేసుకొని నష్టపోతున్నామని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 02 Feb 2023 04:41 IST

ఆయకట్టుకు సాగునీరందక అవస్థలు
న్యూస్‌టుడే, మక్తల్‌ గ్రామీణం

ముస్లాయిపల్లిలో మూతపడ్డ పంప్‌హౌజ్‌

మక్తల్‌ మండలంలోని మూడు ఎత్తిపోతల పథకాలు ఏడేళ్లుగా మూతపడ్డాయి. నీటి వనరులు ఉన్నా వర్షాధార పంటలు సాగు చేసుకొని నష్టపోతున్నామని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎత్తిపోతల పథకాల ఆవిర్భావం నుంచి ఐడీసీ ద్వారా ప్రభుత్వమే నడిపించేది. 2010లో అప్పటి ప్రభుత్వం రైతులకు నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఐదేళ్లపాటు రైతులు సంఘాలుగా ఏర్పడి నడిపించారు. కాల్వల పూడికతీత పనుల మరమ్మతులకు రూ.లక్షలు వెచ్చించడం శక్తికి మించిన భారం కావడంతో 2015 నుంచి ఎత్తిపోతలు మూతపడ్డాయి. పస్పుల, ముస్లాయిపల్లి, ఎత్తిపోతల పథకాల కింద 5,300ల ఎకరాలకు సాగునీరందటం లేదు. ఐడీసీ ద్వారా నిర్వహించే ఎత్తిపోతల పథకాలను ఆయకట్టు రైతులు ఒక్కో ఎత్తిపోతలకు సంబంధించి సంఘంగా ఏర్పడి పంట కాలానికి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసి 2015 వరకు ప్రయివేటు లష్కర్లను నియమించుకొని నడిపించారు. కాల్వలు పూడిక తీయక, పంప్‌ల మరమ్మతుకు రూ.లక్షల్లో వెచ్చించడం శక్తికి మించిన భారం అయ్యింది. ఎత్తిపోతలు నడుపుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2015 తర్వాత అవి మూతపడ్డాయి. ముస్లాయిపల్లి 2 ఎత్తిపోతల కింద 1600ల ఎకరాల ఆయకట్టు ఉండగా ఒక పంప్‌ మాత్రమే నడుపుకొని 600ల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. పస్పుల ఎత్తిపోతల కింద 3500ల ఎకరాలు, ముస్లాయిపల్లి 1 కింద 800ల ఎకరాలు, ముస్లాయిపల్లి 2 కింద వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం 5300ల ఎకరాలకు సాగునీరందటం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో లిఫ్టు మరమ్మతులు చేయకపోవడంతో పొలాలకు సాగు నీరందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ పరిధిలోకి ఈ పథకాలు వచ్చినందున ఆ శాఖ అధికారులు మూతపడ్డ లిఫ్టులు ప్రారంభించి ఆయకట్టుకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరగా లిఫ్టుల మరమ్మతులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.


చివరి ఆయకట్టు వరకు నీరందించాలి : ముస్లాయిపల్లి 1 లిఫ్ట్‌ కింద 800ల ఎకరాలకు సాగునీరందక చిన్నపాటి రైతుల భూములు బీడు భూములుగా మారి రైతులు వలసబాట పడుతున్నారు. లిఫ్ట్‌ కింద నాకు ఐదెకరాల భూమి ఉంది. వర్షాధార పంటలు వేసుకొని ఒక యేటా పండితే మరో యేటా పండక నష్టపోతున్నాను. ఎత్తిపోతలు నడిపించి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలి.

లక్ష్మణ్‌, రైతు, ముస్లాయిపల్లి


నీరందక అవస్థలు : పస్పుల లిఫ్ట్‌ కింద సాగునీరందక వర్షాధార పంటలు సాగు చేశాను. దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పెట్టుబడులు సైతం అందక అప్పులు పెరిగిపోయాయి. నాకున్న ఐదెకరాల్లో ప్రతి ఏటా వర్షాధార పంటలు సాగు చేస్తున్నాను. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి లిఫ్ట్‌లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలి.

- నర్సప్ప, రైతు, పస్పుల


ఎత్తిపోతల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం : నియోజకవర్గం లోని ఎత్తిపోతలను పరిశీలించాం. పంపుల మరమ్మతులు, కాల్వల పూడిక తీతల కోసం ప్రతిపాదనలు పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

- వెంకటరమణ, డీఈ నీటిపారుదలశాఖ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని