logo

మూత్ర పిండం దినదిన గండం

రెండు కిడ్నీలు పాడవటం అతడి కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసింది. కుటుంబ సభ్యుల రెక్కల కష్టం అతడి వైద్య ఖర్చులకు కూడా చాలకపోవటంతో రోజులు గడవటమే గగనంగా మారింది.

Published : 03 Feb 2023 03:16 IST

తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకుడు
న్యూస్‌టుడే, జడ్చర్ల న్యూటౌన్‌

తల్లిదండ్రులతో దీనంగా కూర్చున్న మల్లయ్య

రెండు కిడ్నీలు పాడవటం అతడి కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసింది. కుటుంబ సభ్యుల రెక్కల కష్టం అతడి వైద్య ఖర్చులకు కూడా చాలకపోవటంతో రోజులు గడవటమే గగనంగా మారింది. చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. మిడ్జిల్‌ మండలం వేముల గ్రామానికి చెందిన యువకుడు మల్లయ్యది నిరుపేద కుటుంబం. ప్రైవేటు కోళ్ల పరిశ్రమలో పనిచేస్తూ చేస్తూ తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేవాడు. జీవనం హాయిగా సాగుతున్న సమయంలో విధి వక్రీకరించింది. మూడేళ్ల కిందట అనారోగ్యం పాలై ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. రెండేళ్లుగా వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారంలో మూడు రోజులు డయాలసిస్‌ చేయించుకునేందుకు, మందుల కొనుగోలుకు నెలకు రూ. 10వేల వరకు ఖర్చవుతోంది. కుటుంబ సభ్యులు ఇందుకు ఉన్నదంతా ఖర్చు పెట్టారు. రోజువారీగా కూలీ పనులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి కిడ్నీలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు వెంకటమ్మ, శంకరయ్య ముందుకు వచ్చినా వయస్సు పైబడినందున వారివి పనికి రావని వైద్యులు తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మల్లయ్యకు సపర్యలు చేసేందుకు భార్య ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోంది. చేతకాని వయస్సులో ఉన్న తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో వైద్యం, మందులకు వెచ్చిస్తున్నారు. పేదరికం మెరుగైన వైద్యం చేయించుకునేందుకు అవరోధంగా మారిందని మల్లయ్య భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు చరవాణి నం. 8008551780లో సంప్రదించవచ్చు.


రాత్రి వేళ నరకమే..

మల్లయ్య, బాధితుడు

రాత్రి నిద్ర పట్టదు. రోజూ నరకం చూడాల్సి వస్తోంది. బతికి ఉన్నా ఒక్కోసారి లేనట్లే అనిపిస్తుంది. అన్నం తినేందుకు కూడా శరీరం సహకరించటం లేదు. రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నా. కుటుంబానికి భారంగా మారాను. జీవితంపై విరక్తి కలుగుతోంది. దాతలు స్పందించి ఆర్థికంగా ఆదుకుంటే వైద్యానికి ఆసరా అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని