logo

సౌకర్యాల కల్పన ఎండమావే!

జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు.

Updated : 03 Feb 2023 06:12 IST

ఉపాధి కూలీలకు తప్పని అవస్థలు
అచ్చంపేట, న్యూస్‌టుడే

అప్పాయిపల్లిలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి సమీపిస్తున్నా నిబంధనల ప్రకారం కల్పించాల్సిన వసతులపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికే ఎండల తీవ్రత పెరగడంతో పనిచేసేందుకు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వీరికి గతంలో పని ప్రదేశంలో గుడారాలు ఏర్పాటు చేసేవారు. తాగునీటి వసతి, మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచేవారు. కనీసం భోజన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వసతి లేక కూలీలు తంటాలు పడుతున్నారు. ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో కూలీలకు నీడ కోసం కనీసం ‘గ్రీన్‌ షేడ్‌ నెట్లు’ ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారు. తప్పని పరిస్థితుల్లో మండుతున్న ఎండలోనే కూలీలు పనులు చేస్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో పాటు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండడంతో కూలి సొమ్ము అధికంగా లభిస్తోంది. దాంతో వారు ఉపాధి పనులపై ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం హరితహారం నర్సరీల పనుల్లో కొందరు పనిచేస్తున్నారు.

గిట్టుబాటు కాదాయె..: ఉపాధి హామీ పథకం కింద కష్టపడి పనిచేస్తున్నా కూలి గిట్టుబాటు కావడం లేదని పలువురు కూలీలు వాపోతున్నారు. రోజుకు రూ.246 సొమ్ము అందాల్సి ఉండగా, రూ.120కి మించి రావడంలేదని వారు పేర్కొంటున్నారు. ఏడాదికి కనీసం 200 పని దినాలు కల్పించి, రోజుకు రూ.600 చొప్పున కూలిసొమ్ము చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో బతుకు దెరువు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1694 పంచాయతీల పరిధిలో 8.28 లక్షల జాబుకార్డులు ఉండగా, ఇప్పటివరకు 8 లక్షల మంది కూలీల జాబుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. మిగతా వాటిని ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడంతో వారు పనులు చేసేందుకు అవకాశం ఉండదు.  

ఏడేళ్లుగా అందని పరికరాలు

ఉపాధి కూలీలకు ఏడేళ్లుగా పార, గడ్డపార, తట్టలు తదితర సామగ్రి అందడం లేదు. సొంతగా వాటిని సమకూర్చుకోవడానికి వారు ఇబ్బంది పడుతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో కూలీలు తాగునీటిని వెంట తీసుకెళుతున్నారు. పనిచేసే సమయంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక సమీపంలో ఎక్కడ చెట్టు కనిపించినా.. ఆ నీడలో కొంతసేపు సేద తీరుతున్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించడంతో పాటు పెండింగులో ఉన్న కూలి సొమ్మును వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.  

బిల్లుల చెల్లింపులో జాప్యం

తాము చేసిన పనికి సకాలంలో బిల్లులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. రెండు నెలలుగా అవి పెండింగులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బ్యాంక్‌, తపాలా శాఖల్లో ఖాతాలు ప్రారంభించి, కూలిడబ్బును వాటిలో జమ చేస్తున్నారు. ఈ విధానంలో లోపాలు ఉండడంతో ఆధార్‌తో అనుసంధానం చేసి నేరుగా కూలీలకు సొమ్ము అందేలా చర్యలు తీసుకొంటున్నారు.


కల్పించేందుకు చర్యలు : వేసవి సమీపిస్తున్నందున ఉపాధి హామీ పథకం కూలీలకు పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. గతేడాది గుడారాలు, మందుల కిట్లు అందజేశాం. అన్ని పంచాయతీల పరిధిలో కూలీలకు వీటిని అందుబాటులో ఉంచాలని ఏపీవోలకు సూచించాం. కూలీలకు తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెరిగేలా శ్రద్ధ తీసుకొంటున్నాం. జాబుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి కావచ్చింది. బిల్లులు సకాలంలో అందేలా చూస్తాం. నర్సరీల్లో మొక్కల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించి కూలీలకు పని కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నాం.

నర్సింగరావు, డీఆర్‌డీవో, నాగర్‌కర్నూలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని