logo

నిధులు మంజూరైనా మారని దుస్థితి

జిల్లాలో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. బీటీ రోడ్లు గుంతలు పడి ప్రయాణం నరకంగా మారింది. ప్రభుత్వం మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా గుత్తేదారులు అసలు టెండర్లు వేయడానికే ఆసక్తి చూపడం లేదు.

Published : 03 Feb 2023 03:16 IST

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌

నిధులు మంజూరైనా పనులకు నోచుకోని ధన్వాడ - పాతపల్లి రహదారి

జిల్లాలో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. బీటీ రోడ్లు గుంతలు పడి ప్రయాణం నరకంగా మారింది. ప్రభుత్వం మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా గుత్తేదారులు అసలు టెండర్లు వేయడానికే ఆసక్తి చూపడం లేదు. అధికారులు మూడుసార్లు టెండర్లు ఆహ్వానించినా స్పందన ఉండటం లేదు. దీంతో గుంతల రోడ్ల పరిస్థితి మారక ప్రయాణికులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.

రూ.22.48 కోట్లు మంజూరు..: నారాయణపేట నియోజకవర్గంలోని తొమ్మిది రోడ్లకు మరమ్మతు కోసం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.22.48 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. గత నెల మళ్లీ టెండర్లు పిలిచారు. అయినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతంలో చేసిన రహదారుల పనులకు ఇంతవరకు బిల్లులు రాలేదని, అందుకే టెండర్లు వేయడం లేదని గుత్తేదారులు అంటున్నారు. నారాయణపేట మండలానికి చెందిన ఓ గుత్తేదారు అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు మంజూరు కాక వడ్డీలు పెరిగి భూములు అమ్ముకున్నారని కొందరు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చేపట్టాల్సిన పనులు ఇవీ..:  ధన్వాడ నుంచి పాతపల్లి వరకు బీటీ మరమ్మతు పనులకు రూ.62 లక్షలు మంజూరు అయ్యాయి. నారాయణపేట నుంచి దామరగిద్ద వరకు బీటీ మరమ్మతులకు రూ.5.33 కోట్లు, నారాయణపేట రోడ్లకు ఒకసారి రూ.2.47 కోట్లు, మరోసారి కొన్ని రోడ్లకు రూ.3.50 కోట్లు, కొండాపూర్‌ నుంచి చర్లపల్లికి రూ.50 లక్షలు, మరికల్‌ బైపాస్‌ నుంచి ఆత్మకూరు రహదారికి రూ.80 లక్షలు మంజూరయ్యాయి. సింగారం రోడ్డు బీటీ పునరుద్ధరణకు రూ.80 లక్షలు, దామరగిద్దకు రూ.5.35 కోట్లు, మరికల్‌ మండలంలో పనులకు రూ.3.11 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి రెండుసార్లు, మరికొన్నింటికి మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు.

అన్ని విధాలా ప్రయత్నం..:  టెండర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్‌ అధికారులు గుత్తేదారులకు ఫోన్‌చేసి మరీ కోరుతున్నారు. ఈ సారి వాట్సాప్‌ గ్రూపుల్లోనూ టెండర్ల ప్రక్రియ సమాచారాన్ని పెట్టారు. ఏ రోడ్డుకు ఎంతెంత నిధులు వచ్చాయి బిడ్ల ముగింపు గడువును పొందు పరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అయినా మూడోసారి టెండర్లు ఆహ్వానించినా బిడ్లు దాఖలు కావడం లేదు.


మళ్లీ టెండర్లు పిలిచాం..: గతంలో కొన్నింటికి రెండుసార్లు, మరికొన్ని పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచిన ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదు. దీంతో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 4 నుంచి 8 వరకు టెండర్లు వేయవచ్చు. ఎమ్మెల్యేతో పాటు మేము కూడా ఎంతో కృషి చేసి పనులు మంజూరు చేయించుకున్నాం. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో మొదలు పెట్టలేకపోతున్నాం. ఈసారి టెండర్లు దాఖలు అవుతాయని ఆశిస్తున్నాం

నరేందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని