logo

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు.

Published : 03 Feb 2023 03:16 IST

సమావేశంలో మాట్లాడుతున్న కూనమనేని

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. గురువారం వనపర్తిలోని దాచ లక్ష్మయ్య కల్యాణ మండపంలో సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సీనియర్‌ నాయకుడు డి.చంద్రయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. పేదలను దోచి పెద్దలకు పంచిపెడుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని వ్యాఖ్యానించారు. ఇది దేశ ప్రజలందరినీ నిరాశ పర్చిందన్నారు. పేదలు, రైతులు, యువతను విస్మరించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని దినాలు, నిధుల కేటాయింపును పూర్తిగా తగ్గించారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హయాంలో 11 శాతంగా ఉన్న జాతీయ తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుతం 7 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికీ స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయాలని డిమాండు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము చేస్తున్న ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టువంటిదన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శి విజయరాములు, నాయకులు ఆంజనేయులు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని