logo

కాలుష్యాన్ని భరించలేం.. గ్రామాన్ని వదిలేస్తాం

కాలుష్య కారక ఐరన్‌ పరిశ్రమను మూసివేయండి... లేదా ఇళ్లు.. పొలాలు వదులుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతామంటూ బాలానగర్‌ మండలం గుండేడు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 04 Feb 2023 06:23 IST

రెవెన్యూ కార్యాలయం, ఠాణా ఎదుట ఆందోళన

ఏఎస్సై శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

బాలానగర్‌, న్యూస్‌టుడే : కాలుష్య కారక ఐరన్‌ పరిశ్రమను మూసివేయండి... లేదా ఇళ్లు.. పొలాలు వదులుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతామంటూ బాలానగర్‌ మండలం గుండేడు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు వందల మందికి పైగా మహిళలు, పురుషులు శుక్రవారం గ్రామ సమీపంలోని ఐరన్‌ పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి కారణంగా గ్రామంలో నివాసం ఉండలేక పోతున్నామని, వండిన ఆహార పదార్థాలు కూడా తినలేని పరిస్థితి ఉందని కొద్ది రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. పంట పొలాలు, పండ్ల తోటలపై ఐరన్‌ ఓర్‌ దుమ్ము పేరుకుపోయి పంటలు పండటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఇటీవల సర్పంచు, గ్రామస్థులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పదిహేను రోజుల కిందట పరిశ్రమను పరిశీలించారు. ఇటీవల కూడా పరిశ్రమలో తనిఖీలు చేసిన పీసీబీ అధికారులు చర్యలు తీసుకున్న జాడేమీ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు మూడ్రోజులుగా పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం డప్పులు, బ్యాండు మోతలతో బాలానగర్‌ తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాలుష్య కారక పరిశ్రమను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దారు శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ధర్నా అనంతరం ఏఎస్సై శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. జీఎమ్మార్‌ నర్సింహులు, శ్రీనివాస్‌, శంకర్‌నాయక్‌, శ్రీశైలం యాదవ్‌, చెన్నకేశవులు, వెంకట్‌నాయక్‌, పవన్‌కుమార్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని