logo

దశాబ్దం తర్వాత లభించిన ఆచూకీ

మతి స్థిమితం సరిగా లేక పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ లభించిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరంలో చోటుచేసుకుంది.

Published : 04 Feb 2023 05:44 IST

కుటుంబ పెద్ద వివరాలు తెలియడంతో ఆనందంలో భార్యాపిల్లలు

బెర్హంపూర్‌ ఆసుపత్రిలో ఉన్న వైకుంఠం

అమ్రాబాద్‌, న్యూస్‌టుడే : మతి స్థిమితం సరిగా లేక పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ లభించిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ పల్లెకు చెందిన కొయ్యల వైకుంఠం మతిస్థిమితం సరిగా లేక దశాబ్దం క్రితం తప్పిపోయాడు. ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు అనేక ప్రాంతాల్లో వెదికారు. ఠాణాలోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే గురువారం సాయంత్రం 6 గంటలకు వైకుంఠం వివరాలు, ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి, ఫొటోను విజయవాడకు చెందిన ‘అకాడమీ ఆఫ్‌ హ్యాం రేడియో’ చీఫ్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ అర్జా రమేశ్‌బాబు ఓ వాట్సప్‌ గ్రూపులో పెట్టారు. అది వైరల్‌గా మారి, అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో వైకుంఠం కుటుంబసభ్యులకు చేరింది. దీంతో వారు హ్యాంరేడియో ఆపరేటర్‌ను సంప్రదించారు.

మతిస్థిమితం తప్పి తిరుగుతుండగా..

పశ్చిమ బంగ రాష్ట్రంలోని కోల్‌కతా పరిసర పల్లెల్లో మతిస్థిమితం లేక తిరుగుతున్న వైకుంఠాన్ని గమనించిన అక్కడి పోలీసులు చేరదీసి, చికిత్స నిమిత్తం ఆయన్ను కోల్‌కతాకు 200 కిలోమీటర్ల దూరంలోని ముషీరాబాద్‌ జిల్లా బెర్హంపూర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు. ఇటీవలే కోలుకున్న ఆయన తన వివరాలను ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. ఆ దవాఖానాకు చెందిన సుభోజిత్‌ విజయవాడలోని హ్యాం రేడియో వారిని సంప్రదించడంతో సమాచారం వెలుగులోకి వచ్చింది. తనది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, అమ్రాబాద్‌ మండలంలోని వంకేశ్వరం గ్రామమని, తన పేరు ఎస్‌.దేముడు, భార్య బాలకిష్టమ్మ అనీ, అలాగే తల్లిదండ్రులు నారయ్య, బాలమ్మ, పిల్లలు రంజిత్‌, అరుణ అంటూ వివరాలు తెలియజేశారు. తన పేరు దేముడుగా ఆయన తెలుపడంతో అనుమానం వచ్చిన వైకుంఠం కుమారుడు రంజిత్‌ గూగుల్‌లో ఆ ఆసుపత్రి  చిరునామా వెదికి, ఫోన్‌ నంబరు తెలుసుకొని అక్కడి సిబ్బంది, వైకుంఠంతోనూ మాట్లాడి నిర్ధారణ చేసుకున్నారు. ఆయన పేరును హ్యాంరేడియో వారు పొరపాటున అలా రాశారని వారు తెలిపారు. పదేళ్ల తర్వాత ఆయన ఆచూకీ తెలియడంతో భార్య బాలకిష్టమ్మ, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాంరేడియో సమన్వయకర్త రమేశ్‌బాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని