logo

మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌కు రూ.50 కోట్లు

రైల్వే బడ్జెట్‌లో మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు మొండిచెయ్యే చూపారు. కొత్త రైల్వే లైన్ల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. వాటి ఊసే లేకపోవడం నిరాశకు గురిచేసింది.

Published : 04 Feb 2023 05:44 IST

కొత్త లైన్లకు దక్కని మోక్షం
డబ్లింగ్‌కు రూ.20 కోట్లు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం

రైల్వే బడ్జెట్‌లో మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు మొండిచెయ్యే చూపారు. కొత్త రైల్వే లైన్ల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. వాటి ఊసే లేకపోవడం నిరాశకు గురిచేసింది. కొత్త రైల్వే మార్గాల సర్వే అంశాల ప్రస్తావన కూడా లేకపోవడం జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుయింది.  రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు విదల్చకపోవడం శోచనీయం. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక రైల్వే ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం కొంత ఊరటనిచ్చేలా ఉంది. ఇటీవల పూర్తయిన సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు సైతం నిధులు కేటాయించారు. గద్వాల- మాచర్ల, వికారాబాద్‌- కృష్ణా, జడ్చర్ల- నంద్యాల మార్గాల ప్రతిపాదిత సర్వేలకు ఈసారి కూడా మోక్షం దక్కలేదు. 

* పాలమూరులో కొనసాగుతున్న ఏకైక రైల్వే ప్రాజెక్టు మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌(కర్ణాటక) మార్గానికి ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయి. 246 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైలు మార్గం 1997-98లో మంజూరైంది. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, మరికల్‌, జక్లేరు, ఉప్పర్‌పల్లి, మక్తల్‌, చందాపూర్‌, మాగనూరు, కున్సి, కృష్ణా రైల్వే స్టేషన్ల వరకు పనులు పూర్తయ్యాయి. ఇటీవల ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. కర్ణాటకలోని హుబ్బలి నుంచి కారటిగి వరకు పనులు పూర్తయ్యాయి. ఇంకా దాదాపు 80 కిలో మీటర్ల రైలు మార్గం పూర్తి కావాల్సి ఉంది. ఈ సారి రూ.50 కోట్లు కేటాయించడంతో పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఇలా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే మరో రెండు, మూడేళ్లలో ఈ మార్గంలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి.

* సికింద్రాబాద్‌- మహబూబ్‌నగర్‌ మధ్య 85 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులు 2015-16లో మంజూరయ్యాయి. నాలుగు నెలల క్రితం ఈ పనులు పూర్తయ్యాయి. ఈ సారి బడ్జెట్‌లో రూ.20కోట్లు కేటాయించారు. డబ్లింగ్‌తోపాటు విద్యుదీకరణ పూర్తయిన రెండో లైన్లో రైళ్లు నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌- గద్వాల వరకు విద్యుదీకరణ సైతం పూర్తి చేశారు. గద్వాల-రాయచూరు మధ్య గతంలోనే విద్యుదీకరణ పనులు చేపట్టడంతో ఇప్పుడు హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి నేరుగా రాయచూరు వరకు రైళ్లు విద్యుత్తు  సాయంతో రాకపోకలు సాగిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ మధ్య దాదాపు ఏడేళ్ల తర్వాత డబ్లింగ్‌ పనులు పూర్తవడంతో రైళ్ల సంఖ్యను మరింత పెంచనున్నారు. ముంబయి- పుణె మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించనున్నారు. 

వీటికి మోక్షమెపుడో..? : ఉమ్మడి జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్గాలకు గతంలో ప్రతిపాదించి సర్వేలు చేసినప్పటికీ ఈ బడ్జెట్‌లోనూ మోక్షం కలగలేదు. మాచర్ల-గద్వాల, కృష్ణా-వికారాబాద్‌, జడ్చర్ల-నంద్యాల కొత్త రైల్వే లైన్ల ఊసేలేదు. మాచర్ల-గద్వాల మార్గం ఏర్పాటు చేస్తే మాచర్ల నుంచి నాగార్జునసాగర్‌, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, వనపర్తి, గద్వాల వరకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణా-వికారాబాద్‌ మార్గం కోసం రెండుసార్లు సర్వే చేసి వదిలేశారు. ఈ మార్గం పూర్తయితే మద్దూరు, కోస్గి, కొడంగల్‌ మీదుగా వికారాబాద్‌కు రైలు సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా సిమెంటు రంగం వృద్ధిలోకి రానుంది. ఇక్కడ వలసలు తగ్గి ప్రజలకు పనులు దొరికే ఆస్కారం ఉంటుంది. జడ్చర్ల-నంద్యాలకు మోక్షం లభిస్తే జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కొల్లాపూర్‌, సోమశిల మీదుగా నంద్యాలకు రాకపోకలు సాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని